Last Updated:

High Court: పేపర్‌ లీకేజీ కేసు.. స్టేటస్‌ రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

High Court: టీఎస్ పీఎస్సీ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పేపర్‌ లీకేజీ కేసుకు సంబంధించిన స్టేటస్‌ రిపోర్టును సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

High Court: పేపర్‌ లీకేజీ కేసు.. స్టేటస్‌ రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

High Court: టీఎస్ పీఎస్సీ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పేపర్‌ లీకేజీ కేసుకు సంబంధించిన స్టేటస్‌ రిపోర్టును సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. స్టేటస్‌ రిపోర్టు సమర్పణకు ప్రభుత్వానికి 3 వారాల గడువును విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

నివేదిక ఇవ్వండి.. (High Court)

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై హై కోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నేత బల్మూరి వెంకట్‌ వేసిన పిటిషన్‌ పై హైకోర్టులో విచారణ జరిగింది. దర్యాప్తు సక్రమంగా జరగట్లేదనే వాదనకు పిటిషనర్‌ సరైన ఆధారాలు సమర్పించలేదని కోర్టు తెలిపింది. ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. రాజకీయ దురుద్దేశంతో వేసిన పిటిషన్‌ ఇది. లీకేజీ కేసులో సిట్‌ సమగ్రంగా దర్యాప్తు జరుపుతోంది. కేవలం ఇద్దరినే అరెస్టు చేశారని పిటిషనర్లు అంటున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేశారు అని కోర్టుకు వివరించారు.

వాదనలు విన్న ధర్మాసనం.. లీకేజీ కేసుకు సంబంధించిన స్టేటస్‌ రిపోర్టును సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్టేటస్‌ రిపోర్టు సమర్పణకు ప్రభుత్వానికి 3 వారాల గడువును విధించిన న్యాయస్థానం.. ఈ కేసులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 11కు వాయిదా వేసింది.

ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వేడెక్కుతోంది. సిట్ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆక్టోబర్ నుంచి ఈ దందా సాగుతున్నట్లు సిట్ అధికారులు తేల్చారు. అయితే మరికొన్ని విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.

ఒక్క పరీక్ష నుంచి.. ఏడు పరీక్షల దాకా

ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం ఒక్క పేపర్ నుంచి ఏడు పేపర్ల దాకా వెళ్లింది.

టౌన్‌ప్లానింగ్‌ పరీక్ష ప్రశ్నపత్రంతో మొదలైన లీకేజీ ప్రభావం చివరకు గత అక్టోబరు నుంచి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన అన్ని పరీక్షలపై పడింది.

మొత్తం ఏడు పరీక్షల్లో నాలుగింటిని కమిషన్‌ రద్దు చేసింది.

కాన్ఫిడెన్షియల్ రూమ్ లో నుంచి ప్రశ్న పత్రాలను రాజశేఖర్‌రెడ్డి అక్టోబర్ నుంచి తస్కరించినట్లు సిట్‌ దర్యాప్తులో వెల్లడి కావడమే ఇందుకు కారణం.

ఈ పరీక్షల్లో గ్రూప్‌-1 ప్రధానమైంది. అక్టోబరు 16న ఈ పరీక్ష నిర్వహించగా అంతకు ముందే రాజశేఖర్‌ రెడ్డి కాన్ఫిడెన్షియల్‌ విభాగంలో ఉన్న కంప్యూటర్‌ను యాక్సెస్‌ చేశాడు.

విషయం నిర్ధారణ అయిన తర్వాతే గ్రూప్‌-1 పరీక్షను రద్దుచేశారు.

తప్పుదారి పట్టించేందుకు యత్నం..

ఈ కేసులో పోలీసులను తప్పుదారి పట్టించేందుకే.. నిందితులు తొలుత ఏఈ, టౌన్‌ప్లానింగ్‌ ప్రశ్నపత్రం మాత్రమే లీక్‌ చేసినట్లు చెప్పారు.

సిట్‌ దర్యాప్తులో గ్రూప్‌-1తో పాటు ఇతర పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా బయటకు వచ్చినట్లు తేలడంతో వాటిద్వారా ఎవరెవరు లబ్ధి పొందారన్నది ఆరా తీస్తున్నారు.

ఇప్పటికే గ్రూప్ 1 లో వందకుపైగా మార్కులు సాధించిన వారి జాబితాను రూపొందించారు.

జాబితాలో ఉన్నవారికి, రాజశేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌లకు మధ్య ఏమైనా ఫోన్‌ సంభాషణలు జరిగాయా, ఛాటింగ్‌ చేశారా? అన్న విషయాలను నిర్ధారించుకుంటున్నారు.

దీనికోసం ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి ఫోన్లలో అక్టోబరు నుంచి వాట్సప్‌ ఛాటింగ్‌ వివరాలను తెప్పించుకుంటున్నారు. వీరిద్దరూ ఆరు నెలలుగా ఎవరెవరితో సంప్రదింపులు జరిపారు… వారిలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారెవరున్నారు? తదితర వివరాలన్నీ సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు సేకరిస్తున్నారు. దీంతోపాటు అనుమానిత అభ్యర్థుల బ్యాంకు లావాదేవీలను కూడా వడ పోస్తున్నారు.

లబ్ధిపొందిన వారిని గుర్తించి వారందరిపైనా కేసులు పెట్టడం ఖాయమని ఓ అధికారి వ్యాఖ్యానించారు.