CM Revanth Reddy: అందరి లెక్క సరిచేస్తాం.. రాజన్ననూ సైతం మోసం చేసిన కేసీఆర్
CM Revanth Reddy sensational comments Warangal Public Meeting: మాజీ సీఎం కేసీఆర్ ప్రజలతో బాటు వేములవాడ రాజన్ననూ మోసం చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన వేములవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా వేములవాడలో రూ.127.65 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. అనంతరం నేతన్నల కోసం రూ.50 కోట్లతో నూలు బ్యాంకును సీఎం ప్రారంభించారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు సీఎం పరిహారం అందించారు. అనంతరం వేములవాడ గుడిచెరువులో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం పలు అంశాలపై స్పందించారు.
ఇదీ మా చరిత్ర
కరీంనగర్ గడ్డ మీది నుంచే నాడు సోనియా గాంధీ తెలంగాణ హామీ ఇచ్చారని, దేశాన్ని ప్రధానిగా ఏలిన పీవీ ఈ గడ్డ మీదే పుట్టారని సీఎం గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాంతంలో పలు కీలక ప్రాజెక్టులు, పరిశ్రమలు వచ్చాయని వివరించారు. గతంలో ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికైన పొన్నం ప్రభాకర్ నాడు లోక్‌సభలో కొట్లాడి తెలంగాణ తెచ్చారని, ఇదే సీటు నుంచి రెండు సార్లు బండి సంజయ్‌ను పంపితే తెలంగాణకు చిల్లిగవ్వ తేలేకపోయారని మండిపడ్డారు. మిడ్‌మానేరు నిర్వాసితుల సమస్యలు, ఇతర పెండింగ్ ప్రాజెక్టులతో సహా అన్నింటినీ పూర్తిచేస్తామని సీఎం హామీ ఇచ్చారు. నవంబరు 30న మరోసారి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రాజెక్టులపై సమీక్షిస్తారని సీఎం చెప్పారు.
50వేల కొలువులు..
గత ఏడున్నర దశాబ్దాల చరిత్రలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ పది నెలల్లో 50 వేల కొలువులిచ్చిన ప్రభుత్వం రాలేదని, ఆ ఘనత తమదేనని, ఇది తప్పని రుజువు చేస్తే బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెబుతానని సీఎం అన్నారు. రూ.11వేల కోట్ల రుణమాఫీకి కేసీఆర్ ఐదేళ్లు తీసుకోగా, తాము 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశామని, పెండింగ్‌లోని చివరి రైతుకూ మాఫీ అమలు చేసి చూపుతామని సీఎం హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భరతం పడతామని అన్నారు.
హరీశ్‌రావు లెక్క చెప్పు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే గులాబీ నేతలు తట్టుకోలేకపోతున్నారని, ఈ ఏడాది తెలంగాణలో కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించటం తమ ఘనతేనన్నారు. రూ.1.83 లక్షల కోట్లు ప్రజాధనాన్ని ప్రాజెక్టుల కోసం కేసీఆర్ ఖర్చు పెట్టి సాధించిందేమీ లేదన్నారు. రంగనాయకసాగర్ వద్ద ఫామ్‌హౌస్ కట్టుకోవటం, భూ సేకరణ కోసం తీసుకున్న భూమిని తన పేరున రాయించుకున్న మాటను ఇకనైనా హరీశ్‌రావు ఒప్పుకుని ఆ లెక్కలు చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు.
అదీ చూస్తాం..
డ్రగ్స్ తీసుకున్న వారు ఇంట్లో దొరికితే వారి మీద కేసు పెట్టకూడదా? విదేశీ మద్యంతో దొరికితే కేసు పెట్టకూడదా? చట్టం అందరికీ సమానం కాదా? కేటీఆర్ ఉరుకులాటలు జనం గమనిస్తూనే ఉన్నారని, ఈయన ఎంత దూరం ఉరుకుతాడో చూస్తామని హెచ్చరించారు. తమ సొంత నియోజకవర్గంలో భూ సేకరణపై కుట్ర చేసిన కేటీఆర్ ఊచలు లెక్కపెట్టక తప్పదన్నారు. వెనకబడిన పాలమూరు మీద కక్ష తగదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఇకనైనా అసెంబ్లీకి రావాలని, 80 వేల పుస్తకాలు చదివిన తన జ్ఞానాన్ని అసెంబ్లీ ద్వారా ప్రజలకు పంచాలని సీఎం కోరారు.