CM Revanth Reddy : తెలంగాణ పోటీ అమరావతితో కాదు.. జపాన్‌లో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

CM Revanth Reddy : తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జపాన్ పర్యటనలో భాగంగా శనివారం అక్కడ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో డ్రై పోర్టు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామన్నారు. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్‌ఫ్రంట్‌ను పరిశీలించినట్లు తెలిపారు. మూసీ నది ప్రక్షాళనకు కొంతమంది అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు. ఢిల్లీ పరిస్థితిని చూసి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి కీలమన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెరగాలి..
రాష్ట్రంలో పెట్టుబడులు పెరగాలని, పరిశ్రమలు పెరగాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో ప్రగతి సాధించామని చెప్పారు. ఇప్పుడు పరిశ్రమలను తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ పోటీ ఏపీ రాజధాని అమరావతి, బెంగళూరు, ముంబై, చెన్నైతో కాదని స్పష్టం చేశారు. లండన్, టోక్యో వంటి అభివృద్ధి చెందిన నగరాలతో పోటీ అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో మీ సహకారం అవసరమన్నారు. ఎవరికి వీలైనంత వారు సాయం చేస్తే ప్రపంచంతోనే మనం పోటీపడవచ్చని పిలుపునిచ్చారు.
మూసీ ప్రక్షాళనకు అడ్డు..
టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ పరిశీలించామన్నారు. నీరు, మన సంస్కృతికి, అభివృద్ధికి ప్రతీక అన్నారు. మూసీ ప్రక్షాళనకు కొంతమంది అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో కాలుష్యంతో అన్ని సంస్థలకు సెలవులు ఇస్తున్న పరిస్థితి నెలకొన్నదన్నారు. కాలుష్యంతో ఢిల్లీ స్తంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే హైదరాబాద్‌లో మూసీ ప్రక్షాళన చేయాలని కంకణం కట్టుకున్నామన్నారు. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం ఏమిటో మీకు తెలుసన్నారు. మీ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.