Students Died : బస్టాప్‌లోకి దూసుకెళ్లిన వాహనం.. అక్కడికక్కడే ఇద్దరు నర్సింగ్ విద్యార్థులు మృతి

Two Nursing Students Died : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బొలేరో వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన నిలబడిన విద్యార్థినులపైకి వాహనం దూసుకెళ్లింది. దీంతో మక్తల్‌కు చెందిన మహేశ్వరి, వనపర్తికి చెందిన మనిషా విద్యార్థినులు అక్కడికక్కడే మృతిచెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం సాయంత్రం కొందరు నర్సింగ్ విద్యార్థినులు కళాశాల నుంచి హాస్టల్‌కు వెళ్లేందుకు బస్టాప్‌లో నిలబడి ఉన్నారు. విద్యార్థినులపై బొలేరో వాహనం దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో వాహనం డ్రైవర్ పరారయ్యారు. స్థానికులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
ఘటనా స్థలికి చేరుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి..
ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ సంతోష్ ప్రమాద ఘటనను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మంత్రి దామోదర తీవ్ర దిగ్భ్రాంతి..
ప్రమాద ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇద్దరు నర్సింగ్ విద్యార్థినుల మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే, కలెక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థినులకు వైద్యం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.