Last Updated:

AP Assembly Elections 2024: ఏపీలో కొనసాగుతున్న పోలింగ్ ..చెదురుమదురు సంఘటనలు

ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు ఉదయమే జనం భారీగా తరలివచ్చారు. అధికార వైసీపీ కార్యకర్తలు దాడులతో భయాందోళన కలిగిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి

AP Assembly Elections 2024: ఏపీలో కొనసాగుతున్న పోలింగ్ ..చెదురుమదురు సంఘటనలు

AP Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు ఉదయమే జనం భారీగా తరలివచ్చారు. అధికార వైసీపీ కార్యకర్తలు దాడులతో భయాందోళన కలిగిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ, కూటమి ఏజెంట్లపై దాడులకు తెగబడ్డారు. కొన్ని పోలింగ్ బూత్‌ల వద్ద దాడులు జరిగి భయాందోళన పరిస్థితి నెలకొంది.

ఏజెంట్ల అపహరణ..(AP Assembly Elections 2024)

అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పాపక్కగారి పల్లె పోలింగ్ కేంద్రంలో వైసీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను బయటకు పంపిన సంఘటన చోటు చేసుకుంది . పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెండాలలో టీడీపీ ఏజెంట్లపై దాడి చేశారు. ఘటనలపై ఎన్నికల సంఘం స్పందించింది. అవసరమైతే అదనపు బలగాలను మొహరిస్తామని స్పష్టం చేసింది. వైఎస్ఆర్ జిల్లా చాపాడు మండలం చిన్న గులవలూరులో టీడీపీ ఏజెంట్‌పై దాడి చేశారు. అనంతపురం కల్యాణదుర్గం మండలంలో ఓ పోలింగ్ కేంద్రం వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. చిత్తూరు జిల్లా పీలేరులో ముగ్గురు టీడీపీ ముగ్గురు ఏజెంట్లు కిడ్నాప్‌నకు గురయ్యారు. ఇదే అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

యువకుడిపై దాడి, తలకు గాయం..

ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం ముప్పాళ్లలో ఓటర్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసినట్లు తెలుస్తోంది . శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైసీపీ అభ్యర్థి దుద్దికుంట శ్రీధర్ రెడ్డి సొంత గ్రామం నల్లసింగయ్యపల్లి 147వ పోలింగ్ కేంద్రంలోకి ఆ పార్టీ నేతలు చొరబడ్డారు. పది ఓట్లు వేయించుకున్నారని తెలుగుదేశం కార్యకర్తలు ఆరోపించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వై రాంపురంలో 178వ బూత్‌లో పోలింగ్ నిలిచింది. వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి పీఏ వీరన్న సూచనలతో పోలింగ్ ఆపారని తెలుగుదేశం శ్రేణులు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం పొందూరు మండలం గోకర్ణపల్లెలో ఘర్షణ జరిగింది. వైసీపీ- టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణలో ముగ్గురు గాయపడ్డారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం పరిశావారి పలెంలో ఓటు వేసేందుకు వచ్చిన యువకుడిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దాంతో యువకుడి తలకు గాయమైంది.

ఆయుధాలతో దాడులు..

పల్నాడు జిల్లా మాచర్ల మండలం కంభంపాడులో వైసీపీ- టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వివాదం జరిగింది. వైసీపీ శ్రేణులు గొడ్డళ్లు, వేట కొడవళ్లు, రాడ్లతో దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావారణం నెలకొంది. భారీగా పోలీసు బలగాలను మొహరించారు. పరిస్థితిని ఐజీ శ్రీకాంత్ పర్యవేక్షిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో గల మల్లెవారిపల్లిలో టీడీపీ కార్యకర్త జడ రాంప్రసాద్‌పై వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. నంద్యాల జిల్లా ప్యాపిలి ఎస్సై జగదీశ్వర్ రెడ్డి రెచ్చి పోయారు. పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ నారాయణ మూర్తిపై చేయి చేసుకున్నారు. పోలీసు అధికారులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

స్పీకర్ హల్ చల్..

ఆముదాలవలసలో గల 158, 159 పోలింగ్ బూత్‌లలో తమ్మినేని సీతారాం సతిమణీ వాణిశ్రీ హల్ చల్ చేశారు. తన అనుచరులతో కలిసి వాణి శ్రీ పోలింగ్ బూత్‌లను ఆక్రమించారు. పోలింగ్ బూత్‌ నుంచి బలవంతంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులను బయటకు పంపించేశారు.