Srisailam Temple : శ్రీశైలం ఆలయం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

Srisailam Temple : శ్రీశైలం మల్లన్న స్వామి వారిని దర్శించుకోవడానికి రోజూ వందల మంది భక్తులు వస్తుంటారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీశైలానికి వచ్చే భక్తులు వసతి కోసం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిస్తారు. కాగా, ఆలయంలో మరో తరహా మోసం వెలుగు చూసింది. కొంతమంది కేటుగాళ్లు దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్ సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆలయంలో వసతి కోసం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించే భక్తులను మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
కొంతమంది భక్తులు శ్రీశైలం ఆలయంలో వసతి కోసం నకిలీ వెబ్‌సైట్‌ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా భక్తులు కొంత డబ్బులు కూడా చెల్లించారు. దీంతో దుండగులు చేసిన పనికి హైదరాబాద్, ముంబయికి చెందిన భక్తులు మోసపోయారు. డబ్బులు చెల్లించిన అనంతరం జరిగిన మోసాన్ని భక్తులు గుర్తించారు. విషయాన్ని శ్రీశైలం దేవస్థానం దృష్టికి తీసుకెళ్లడంతో నకిలీ వెబ్‌సైట్ వ్యవహారం గుట్టు రట్టు అయింది. గతంలో ఇలాంటి మోసాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. దేవస్థానం అధికారులు మోసాలపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.