Last Updated:

Telangana Rains: తెలంగాణలో మరో మూడురోజులపాటు వర్షాలు.. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్

గత కొద్ది రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని రీతిలో వర్షాలు కురిశాయి. కాగా ఇక నుంచి సెంట్రల్ తెలంగాణలో వర్షాలు ఎక్కువగా కురవనున్నాయి. హైదరాబాద్్,జనగామ, యాదాద్రి, మహబూబ్‌బాద్, నల్గొండ, సూర్యాపేట, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Telangana Rains: తెలంగాణలో మరో మూడురోజులపాటు వర్షాలు.. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్

Hyderabad: గత కొద్ది రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని రీతిలో వర్షాలు కురిశాయి. కాగా ఇక నుంచి సెంట్రల్ తెలంగాణలో వర్షాలు ఎక్కువగా కురవనున్నాయి. హైదరాబాద్, జనగామ, యాదాద్రి, మహబూబ్‌బాద్, నల్గొండ, సూర్యాపేట, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఒడిశా తీరంలోని వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. భాగ్యనగరాన్ని ముసురు వదలడం లేదు. వరుసగా ఐదోరోజూ తేలికపాటి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌ తడిసి ముద్దవుతోంది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు వరదనీరు పోటెత్తడంతో జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ నిండుకుండల్లా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణలోని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.

రాష్ట్రంలో నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో ప్రజలు నానా ఇబ్బందులుపడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాబాద్‌ జిల్లాలో ఐదోరోజూ జోరు వర్షమే కురిసింది. పల్లె, పట్టణమనే తేడాలేకుండా అప్రకటిత బంద్‌ వాతావరణం నెలకొంది. అత్యధికంగా కుమురంభీం జిల్లా కెరమెరి మండలంలో 16.45 సెంటీ మీటర్లు, నిర్మల్‌ జిల్లా మామడ మండలంలో 16.24 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్‌ సమీపంలోని నాగాపూర్‌ వంతెనపై వరద పొంగిపొర్లడంతో ఆదిలాబాద్‌-మంచిర్యాల మార్గంలో రవాణా స్తంభించింది. ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్‌కు చెందిన తొమ్మిది నెలల గర్భిణిని ప్రసవంగా కోసం ఆదిలాబాద్‌కు తరలిస్తున్న క్రమంలో.. వాగుపొంగిపొర్లడంతో ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. అతికష్టంమీద ఆమెను రిమ్స్‌కు తరలించారు. నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై మామ‌డ మండ‌లం న్యూసాంగ్వి వ‌ద్ద అప్రోచ్ రోడ్ కోతకు గురైన ప్రాంతాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా వర్షం కురుస్తోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాని పరిస్థితి నెలకొంది. తిమ్మాపూర్ మండలంలోని నెదునూరులో దెబ్బతిన్న ఇళ్లను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా కలెక్టర్ ఆర్వీకర్ణన్ పరిశీలించారు. పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్‌లోని స్వప్న కాలనీలో ఇళ్లల్లోకి వరద నీరు భారీగా చేరింది. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి రామగుండం వెళ్లే రాజీవ్‌ రహదారిపై పలుచోట్ల వర్షపునీరు ప్రవహిస్తుండటంతో వాహనచోదుకులు ఆందోళన చెందుతున్నారు. సుగ్లాంపల్లితో పాటు రంగంపల్లి వద్ద రాజీవ్‌రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు రోడ్డుపై నుంచి వెళ్లాలంటేనే భయపడుతున్నారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వరంగల్ నగరంలోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ చౌరస్తా రహదారితో పాటు స్టేషన్ రోడ్‌లో వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరికవాడతో పాటు మైసయ్యనగర్‌లో వరద నీరు రోడ్డుపై నిలవడంతో కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. రాయపర్తి మండలకేంద్రం, గన్నారంలో పలు చోట్ల ఇళ్లు కూలిపోయి, ప్రజల నిలువ నీడను కోల్పోయారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి, ఇందిరానగర్‌లో, ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల దాటికి పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి.

భూపాలపల్లి, ములుగు జిల్లాలపై వరుణుడు ఉగ్రరూపం చూపుతున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలుచోట్ల రాకపోకలకు తెగిపోయాయి. గణపురం మండలం మోరాంచ వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో, మొరంచలోని వైకుంఠధామం మునిగిపోయింది. చెల్పూర్ నుంచి పెద్దాపూర్‌కు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గణపురం, కొండాపురం మధ్య వాగు రావడంతో సీతారాంపురం, అప్పయ్యపల్లె, గుర్రంపేట వాసులు.. మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లిలోనే బాంబులగడ్డ ప్రాంతంలో ఇళ్లలోకి నీరు చేరింది. భూపాలపల్లి ప్రభుత్వ పాఠశాలలోకి భారీగా వరద నీరు చేరి జలమయమయ్యింది. వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. నాలుగు రోజులుగా పలిమేల మండలానికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కనీసం తాగడానికి మంచి నీరు దొరకని పరిస్థితి నెలకొంది. మహాముత్తారం మండలంలో వాగులు ఉద్ధృతికి పలు ప్రధాన రహదారులు సైతం కొట్టుకుపోయాయి. గ్రామాల చుట్టూ వరద నీరు చేరడంతో అటవీప్రాంతాల్లో ప్రజలు డేరాలు వేసుకొని తలదాచుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి: