Last Updated:

Governors: సీఎంలను ఢీ కొడుతున్న గవర్నర్లు

బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్‌లు సీఎంలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రస్తుతం పంజాబ్‌, కేరళ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, గవర్నర్‌లకు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి.

Governors: సీఎంలను ఢీ కొడుతున్న గవర్నర్లు

Governors vs CMs: బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్‌లు సీఎంలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రస్తుతం పంజాబ్‌, కేరళ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, గవర్నర్‌లకు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. దీంతో గవర్నర్‌ నియామకాల పై మరోసారి చర్చ నడుస్తోంది. తాను తక్కువ తినలేదన్నట్లుగా తెలంగాణ గవర్నర్‌ తమిళ సై కూడా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంమైంది.

అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లులకు రాజముద్ర వేయకండా పెండింగ్‌లో పెట్టిన తెలంగాణ గవర్నర్‌ తమిళసై. తమిళనాడులో పదవులను అమ్ముకుంటున్నారని గవర్నర్‌ బన్వారీలాల్ పురోహిత్ ఆరోపణలు. మద్యం, లాటరీని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా చూస్తోందని మండిపడ్డ కేరళ గవర్నర్‌ ఆరిఫ్ మహ్మద్ ఖాన్. ఇలా ఒకట్రెండు రోజుల వ్యవధిలోనే ఆయా ప్రభుత్వాల తీరు పై గవర్నర్లు కామెంట్స్‌ చేయడం కలకలం రేపుతోంది. తాజాగా తమిళ సై చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ కు మధ్య సత్ససంబంధాలు ఏమాత్రం లేవన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

ఈ ఇద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగిందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. తెలంగాణ అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులు, గవర్నర్ ఆమోదం కోసం వెళ్లగా, వాటికి ఆమె రాజముద్ర పడకపోవటంతో అలానే పెండింగ్ లో ఉండిపోయాయి. తన విషయంలో కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తున్న ధోరణికి తీసిపోని రీతిలో ఆమె తీరు ఉండటం గమనార్హం. ఆరు చట్ట సవరణ బిల్లులతో పాటు మరో రెండు కొత్త బిల్లులు సైతం పెండింగ్ లోనే ఉన్నాయి. రాజ్ భవన్ లో పెండింగ్ లో ఉన్న బిల్లుల్ని చూస్తే, వర్సిటీల్లో రిక్రూట్మెంట్‌కు కామన్ బోర్డు, మున్సిపాలిటీ యాక్ట్ సవరణ, ఫారెస్ట్ వర్సిటీ అజామాబాద్ పారిశ్రామికవాడ చట్టం బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అసెంబ్లీ చట్టం చేసినా, దానికి రాజముద్ర వేయాల్సింది మాత్రం గవర్నరే. తనను పూచిక పుల్ల మాదిరి అన్నట్లుగా వ్యవహరిస్తున్న కేసీఆర్ సర్కారుకు టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా తన చేతిలో ఉన్న అధికారాన్ని తమిళ సై చూపించేందుకు వెనుకాడటం లేదు. ఈ పరిణామాలతో తెలంగాణ సర్కార్ – గవర్నర్ మధ్య అగాధం బాగా పెరిగిపోయిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్ని రాజ్ భవన్ ఆమోద ముద్ర వేయకుండా ఆపటం పైనా గవర్నర్ తమిళ సై స్పందిస్తున్నారు. బిల్లుల్ని ఆపే విచక్షణ అధికారం తనకు ఉన్న విషయాన్ని ఆమె గుర్తు చేస్తున్నారు.

మరోవైపు, తమిళనాడులో వీసీ పదవులను అమ్ముకుంటున్నారని, పంజాబ్ గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం తన పరిధికి మించి వ్యవహరించిందని అన్నారు. గవర్నర్ చేయాల్సిన పనిని కూడా ప్రభుత్వం చేయడం ఏంటని ఆయన నిలదీశారు. నిజానికి తమిళనాడు ప్రభుత్వం పై ఎక్కడో ఉన్న పంజాబ్ గవర్నర్ ఇలా విమర్శలు చేయడం ఏంటనే సందేహం వస్తుంది. అయితే, గతంలో ఆయన తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. ఈ సమయంలో వెలుగు చూసిన అంశాలను తాజాగా ఆయన వెల్లడించడం. అది కూడా మీడియా ముందు ప్రస్తావించడం. కలకలం రేపుతోంది. యూనివర్సిటీలకు ఉపకులపతులను నియమించే అధికారం, గవర్నర్లకే ఉంటుంది. అయితే, కొన్నాళ్లుగా ఈ అధికారాల్లోకి ప్రభుత్వాలు చొచ్చుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన తాజాగా తమిళనాడు ఇష్యూను తెర మీదికి తెచ్చారు. తమిళనాడులో తాను గవర్నర్‌గా ఉన్నప్పుడు, జరిగిన ఘటన ఇదీ అంటూ మీడియాకు వెల్లడించారు. ఓ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవిని రూ.40-50 కోట్లకు విక్రయించారని బన్వారీలాల్ పురోహిత్ వెల్లడించడం సంచలనం సృష్టించింది.

పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ సత్బీర్ సింగ్ గోసల్‌ణు చట్టవిరుద్ధంగా నియమించారని పురోహిత్ ఆరోపించారు. ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించాలని గతంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను కోరారు. అయితే, సీఎం మాన్ మాత్రం గవర్నర్‌ పై రివర్స్ అయ్యారు. యూనివర్సిటీ కార్యకలాపాల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. అయితే, వీరిద్దరి మధ్య గొడవతో తమిళనాడులోని లొసుగులు బయటకు వస్తున్నాయి. అటు గత కొంతకాలంగా కేరళ సర్కారుకు గవర్నర్‌కు మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేయాలని గవర్నర్‌ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కోరారు. యూజీసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీ వీసీ నియామకాన్ని రద్దు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉటంకిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. వీసీలు రాజీనామా చేయకుంటే షోకాజ్ నోటీసులు అందజేసి తొలగిస్తామని రాజ్‌భవన్‌ హెచ్చరించింది. అయితే ఈ ఆదేశాలు, విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్‌కు, రాష్ట్రంలో అధికార ఎల్‌డీఎఫ్ కూటమికి మధ్య విభేదాలను పెంచే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లోకి ‘సంఘ్ ఎజెండా’ను నెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఎల్‌డీఎఫ్ కూటమి ఆరోపించింది. రాష్ట్ర చట్టాలకు అనుగుణంగా వర్సిటీల వైఎస్ ఛాన్సలర్‌లను నియమించినందున గవర్నర్ ఉత్తర్వులు ‘‘ప్రజాస్వామ్యం అన్ని పరిమితులను ఉల్లంఘించాయి’’ అని సీపీఎం ఆరోపించింది.అయితే ఇప్పటివరకు వైస్ ఛాన్సలర్లు ఎవరూ కూడా రాజీనామా చేయలేదు. ఈ వ్యవహారంపై వారు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌లు వేశారు. గవర్నర్‌ పై చట్టపరంగా పోరాడాలని నిర్ణయానికి వచ్చారు.

తాజాగా, ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్. మద్యం, లాటరీని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా చూస్తోందని మండిపడ్డారు. ఇది వింటుంటే తనకే సిగ్గుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. డ్రగ్స్‌కు అడ్డాగా ఉన్న పంజాబ్‌ను త్వరలోనే కేరళ దాటేయబోతోందని వ్యాఖ్యానించారు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్. ‘నూరు శాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి సిగ్గుచేటు. అసలు ఈ లాటరీలేంటి? పేద ప్రజలు లాటరీ టికెట్లు కొంటే ఇక్కడ కూర్చుని మీరు డబ్బులు లెక్క పెట్టుకుంటారా? ప్రజల్ని మద్యానికి బానిసలుగా చేస్తున్నారు’ అంటూ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మద్య పానానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన చోట, మద్యం తాగాలని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. మొత్తం మీద మూడు రాష్ట్రాల గవర్నర్లు తమ వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచారు. ప్రభుత్వాల తీరు పై ఇలా బహిరంగంగా కామెంట్స్‌ చేయడం చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో మరోసారి గవర్నర్‌ వ్యవస్థ, సీఎంల మధ్య విభేదాలు బట్టబయలు అయ్యాయి.

ఇవి కూడా చదవండి: