Advaned Facilitated Oldage Home: నిర్మల్ లో అత్యాధునిక వసతులతో వృద్ధాశ్రమం!
Latest Old age Home At Nirmal: జీవితంలో ఎన్నో కష్ట, సుఖాలు అనుభవించి, బరువు బాధ్యతలు మోసి.. తమ కుటుంబాలను, పిల్లలను ఓ దారికి తెచ్చుకుని.. వారి ఆలనా పాలనా పూర్తయ్యాక ఇక తమ శేష జీవితం తీర్థయాత్రలు తిరుగుతూ గడిపేస్తారు. కానీ వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు, ఒంట్లో శక్తి లేకపోవడంతో చాలా మంది ఎక్కడికీ వెళ్లలేక, ఇంట్లోనే ఉండలేక చాలా బాధ పడుతుంటారు. మానసిక ప్రశాంతత కోసం దగ్గర్లో ఏదైనా ప్రదేశానికి వెళ్లి కొంత సేదతీరాలని అనుకుంటారు.
అలాంటి వారికోసం నిర్మల్ జిల్లాలో విలాసవంతమైన వృద్ధాశ్రమం ఏర్పాటు అవుతోంది. నిర్మల్ పట్టణం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో భైంసా సమీపంలోని చాతా గ్రామంలో దీనిని నిర్మిస్తున్నారు. అర్చనా ఎల్డర్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఆధునిక ప్రాజెక్ట్ చేపట్టింది. దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ వృద్ధాశ్రమంలో అత్యున్నత ప్రమాణాలు, అన్ని వసతులు, హెలిప్యాడ్ సౌకర్యంతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు వృద్ధాశ్రమం సీఈవో బద్దం భోజారెడ్డి పలు విషయాలు వెల్లడించారు. కుబీర్ మండలంలో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అక్టోబర్ 2, 2025 నుంచి ఈ ఆశ్రమం ప్రారంభిస్తామని చెప్పారు.
ఇక్కడ ఉండే వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎళ్లవేళలా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అలాగే అత్యవసర వైద్యం కోసం, అలాగే వేరే ప్రాంతాల నుంచి తమ తల్లిదండ్రులను కలిసేందుకు వచ్చే వారి పిల్లలు సులభంగా చేరుకునేలా 3 ఎకరాల్లో హెలిప్యాడ్ నిర్మిస్తున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి కేవలం 40 నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ ఆశ్రమంలో 108 గదులు నిర్మిస్తున్నారు. అందులో 100 గదులు బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి. వీటిని గోదావరి, యమున, గంగా సెక్టార్లుగా విభజించారు. గోదావరి క్లస్టర్ లో 65 గదులు, యుమునా సెక్టార్ లో 35 గదులు, గంగా క్లస్టర్ లో 8 ప్రీమియం రూమ్స్ ఉంటాయి. అన్ని రూములు గ్రౌండ్ ఫ్లోర్ లోనే నిర్మించడం విశేషం. ఇక్కడ నివసించేందుకు వచ్చే వారు రూ. 5 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ. 4 లక్షలను తిరిగి చెల్లిస్తారు. రూ. 1 లక్ష మాత్రం నాన్- రిఫండబుల్ కింద జమ చేసుకుంటారు. త్వరలోనే బుకింగ్స్ ను ప్రారంభిస్తామని నిర్వహాకులు తెలిపారు.
అలాగే భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. కంపౌండ్ చుట్టూ 12 అడుగుల ఎత్తులో రాతి గోడ, సోలార్ ఫెన్సింగ్, 230 సీసీ కెమారాలతో పర్యవేక్షణ, 40 మంది సెక్యూరిటీ గార్డులను నియమించారు. వైద్యం కోసం అలోపతి, ఆయుర్వేదం, హోమియోపతి క్లినిక్, అంబులెన్స్ అందుబాటులో ఉంచనున్నారు. అలాగే ఎప్పటికప్పుడు బీపీ, షుగర్, ఈసీజీ, జీపీఎస్ తో కూడిన రింగ్ డివైజ్ ను అందుబాటులో ఉంచుతారు. అలాగే ఎల్లవేళలా కాపాడుకుంటూ కేర్ టేకర్స్, నర్సులు ఉంటారు. అలాగే వృద్ధులకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించనున్నారు. వారికి ఆహ్లాదం కలిగించేందుకు టీవీ, వైఫై, గేమ్స్, కాసేపు విహరించేందుకు అక్కడే ఏర్పాటు చేసిన సరస్సులో బోటింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తారు. పచ్చని కొండల మధ్యలో కాలుష్య రహిత ప్రాంతంలో పక్షులు, జింకలు, నెమళ్లతో ఆశ్రమాన్ని మరింత అందంగా తయారుచేయనున్నారు. అలాగే పార్కులు, సేంద్రియ పదార్థాలతో సాగుచేసే కూరగాయలు, పండ్లు అందించనున్నారు. ఇంకెందుకు ఆలస్యం పెద్ద వయస్సులో వ్యయ, ప్రయాసలతో ఎక్కడెక్కడికో వెళ్లే బదులు చక్కగా ఈ ప్రాంతానికి వెళ్లి సేదతీరవచ్చు.