Thailand: థాయ్‌లాండ్ ప్రధానిపై సస్పెన్షన్ వేటు

Paetongtarn: థాయిలాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రాపై వేటు వేశారు. పొరుగుదేశం నేతకు చేసిన ఓ ఫోన్ కాల్ లీక్ అయ్యింది. దీంతో ఆమె పదవికి ఎసరు వచ్చింది. ప్రధాని కంబోడియా నేతతో దేశానికి సంబంధించిన విషయాలు చర్చించి, మంత్రివర్గ నీతిని ఉల్లంఘించారని అక్కడి కన్జర్వేటివ్ సెనేటర్ల బృందం ఆరోపించింది. దేశంలోని రాజ్యాంగ నిబంధనలను పేటోంగ్టార్న్ ఉల్లంఘించారని పేర్కొంది. ఇటీవల ఆమెపై కేసు దాఖలు చేసింది. విచారణ జరిపిన ఆ దేశ న్యాయస్థానం ప్రధానిపై సస్పెన్షన్ వేటు వేసింది. తుది తీర్పు వెలువడే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. తీర్పు ఆమెకు వ్యతిరేకంగా ప్రధాని పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది.
థాయ్‌కి పొరుగున ఉన్న కంబోడియా మాజీ ప్రధాని హున్‌సేన్ 2023 వరకు అధికారంలో ఉన్నారు. తర్వాత పదవి నుంచి దిగిపోయారు. అనంతరం ఆయన కొడుకు హున్ మానెట్ అధికార పగ్గాలు చేపట్టారు. హున్‌సేన్ పదవిలో లేకపోయినా కంబోడియా రాజకీయాలను ప్రభావితం చేయగలడు. ఇటీవల ఆయనకు థాయ్‌లాండ్ ప్రధాని షినవత్రా ఫోన్ చేశారు. అంకుల్ అంటూ సంబోధించారు. తన దేశంలోని పరిస్థితులను వివరించారు. థాయ్‌లాండ్ ఆర్మీ కమాండర్ తనకు వ్యతిరేకంగా ఉన్నాడని పేర్కొన్నారు.
ఇద్దరూ మధ్య జరిగిన ఫోన్‌కాల్ సంభాషణ లీక్ అయ్యింది. సాధారణంగా కంబోడియా-థాయ్‌ల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. సరిహద్దు వివాదాల కారణంతో మధ్యకాలంలో మరింతగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని పొరుగుదేశం నేతతో మాట్లాడిన తీరు వివాదాస్పదమైంది. దీంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. సొంత పక్షం నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని ఫోన్‌తో తమ దేశ పరువు, ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ షినవత్రా సంకీర్ణ సర్కారు నుంచి కన్జర్వేటివ్ భూమ్‌జాయ్‌థాయ్ పార్టీ విడిపోయింది.
థాయ్ బిలియనీర్, మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రా కుమార్తె షినవత్రా. గతేడాది ఆగస్టులో ప్రధాని పదవి చేపట్టారు. 37 ఏళ్లకు ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. ఆ దేశ చరిత్రలోనే అతి పిన్న ప్రధానమంత్రిగా, రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు.