Russia: 477 డ్రోన్లు, 60 క్షిపణులు.. ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి

Russia attack On Ukraine: రష్యా-ఉక్రెయిన్ రెండుదేశాల మధ్య యుద్ధం ఏండ్లుగా కొనసాగుతోంది. యుద్ధంలో ఇరుదేశాలు పెద్దఎత్తున సైనికులు, పౌరులను కోల్పోయాయి. ఈ క్రమంలోనే రష్యా యుద్ధం మొదలైన నాటి నుంచి గతంలో ఎన్నడూ చేయనంత భారీ స్థాయిలో ఉక్రెయిన్‌పై వైమానిక దాడులు చేసింది.
గత రాత్రి రష్యా 477 డ్రోన్లు, 60 క్షిపణులు ఉన్నాయని ఉక్రెయిన్ వాయుసేన వెల్లడించింది. అందులో 249 డ్రోన్లను కూల్చేశామని పేర్కొంది. మరో 226 డ్రోన్లు ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థల వల్ల వాటంతటా అవే కూలిపోయాయని తెలిపింది. ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ కమ్యూనికేషన్ కమాండర్ యూరీ ఇహ్‌నాట్ మాట్లాడారు. గత రాత్రి అతిపెద్ద దాడి జరిగిందని తెలిపారు.
ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా ఆయుధాలను ప్రయోగించినట్లు ఇహ్‌నాట్ తెలిపారు. పోలాండ్ గగనతల రక్షణ కోసం మిత్రదేశాల యుద్ధ విమానాలు రంగంలోకి దిగినట్లు పేర్కొన్నారు. ఖెర్సాన్ ప్రావిన్సులో జరిగిన దాడుల్లో ఒకరు మృతిచెందినట్లు అక్కడి గవర్నర్ వెల్లడించారు. రష్యాలో వేర్పాటువాదాన్ని పశ్చిమ దేశాలు ప్రోత్సహిస్తున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధంలో జోక్యం చేసుకుంటున్నాయని ఆరోపించారు.