China: జిన్‌పింగ్ అత్యంత సన్నిహితుడిపై వేటు.. చైనా సైన్యంలో కలకలం

China President Xi Jinping: చైనాలో అత్యంత కీలకమైన సెంట్రల్ మిలటరీ కమిషన్ నుంచి జిన్‌పింగ్ సన్నిహిత జనరల్‌ను తొలగించారు. జనరల్ మియా హువను పార్లమెంట్ ఓటింగ్ ద్వారా తప్పించారు. విషయాన్ని షిన్హూవా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. గత సంవత్సరం నవంబరులో ఆయన క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు రాగా, దర్యాప్తు చేపట్టారు.
ఆయన గతంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాజకీయ సిద్ధాంత విభాగానికి అధిపతిగా ఉన్నారు. చైనా సీనియర్ రక్షణశాఖ వెబ్‌సైట్‌లో అధికారుల పేర్ల జాబితా నుంచి మియా ఫొటో, పేరును తొలగించారు. దీంతోపాటు చైనా నేషనల్ లెజిస్లేచర్ నుంచి తీసేశారు. 14 నేషనల్ కాంగ్రెస్ ప్రతినిధి హోదా నుంచి తప్పించాలని మార్చి 14 సెంట్రల్ మిలటరీ కమిషన్ నిర్ణయించింది.
చైనా సైన్యంలో అవినీతిని పెకలించేందుకు జిన్‌పింగ్ చేపట్టిన చర్యలు మరోస్థాయికి వెళ్లినట్లు షిన్హూవా తెలిపింది. ఇప్పటికే 12 మంది కీలక జనరల్స్‌తోపాటు రక్షణ రంగంలోని పరిశ్రమలకు చెందిన ఎగ్జిక్యూటివ్‌లపై చర్యలు తీసుకున్నారు. జిన్‌పింగ్ ఫుజియాన్ ప్రావిన్స్‌లో స్థానిక అధికారిగా పనిచేసేటప్పుడు మియా అక్కడే విధులు నిర్వహించేవారు. జిన్‌పింగ్ స్వయంగా ఆయన్ను సెంట్రల్ మిలటరీ కమిషన్‌కు తీసుకొచ్చారు.
వైస్ అడ్మిరల్ లి హాంజున్‌ను పార్లమెంటరీ డెలిగేట్ హోదా నుంచి శుక్రవారం తొలగించారు. లీ గతంలో పీఎల్‌ఏ నేవీకి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా విధులు కూడా నిర్వహించారు. కేంద్ర మిలటరీ కమిషన్‌కు చెందిన నేత హీ వీడాంగ్ మార్చి నెలలో వార్షిక పార్లమెంట్ సమావేశాలు ముగిసిన నాటి నుంచి బాహ్య ప్రపంచంలో కనిపించడంలేదు. పొలిట్ బ్యూరో, మిలటరీ సమావేశాలకు ఆయన గైర్హాజరవుతున్నారు.