Chandrababu: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై అనుమానాలను నివృత్తి చేయాలి: ఏపీ సీఎం చంద్రబాబు!

Polavaram-Banakacharla Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై అనుమానాలను నివృత్తి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, నేతలకు సూచించారు. ప్రాజెక్టు ద్వారా వరద జలాలను మాత్రమే వాడుకుంటున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. 42 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు.
తెలంగాణలో అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపట్టినా అభ్యంతరం చెప్పలేదన్నారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై నేతలంతా మాట్లాడాలని కోరారు. కేవలం రాజకీయాల కోసం తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత మంత్రులు, నాయకులపై ఉందని తెలిపారు.
అమరావతిలో మలివిడత భూసేకరణపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. మొదటి విడత నిబంధనలు మలివిడతకూ వర్తింపజేయాలని నిర్ణయించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలను ఇన్‌చార్జి మంత్రి నేతృత్వంలో జిల్లాస్థాయిలో నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. తర్వాత నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాల నిర్వహణకు ఆమోదం తెలిపారు. ఏడాదిలోపు రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. సాంకేతిక సమస్యల సాకుతో దాటవేత ధోరణి సరికాదన్నారు.
ఇబ్బందులు ఉంటే తనతో మాట్లాడాలని నేతలకు సూచించారు. రెవెన్యూ సమస్యలపై తరచూ అడుగుతూనే ఉంటానని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది విజయాలు ఇంటింటికీ తీసుకెళ్లే కార్యాచరణ రూపొందించామని సీఎం అన్నారు. జులై 1 నుంచి ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలన్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణ, విరాళాలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించారు.