Kalaburigi Railway Station : కలబురగి రైల్వేస్టేషన్ కు రంగు మార్పు… హిందూ సంఘాల ఆగ్రహంతో వెనక్కి తగ్గిన అధికారులు !
కర్నాటకలోని కలబురగి రైల్వేస్టేషన్ గోడలపై ఆకుపచ్చ రంగు వేయడం హిందూ సంఘాల ఆగ్రహానికి కారణమైంది.
Kalaburagi : కర్ణాటకలోని కలబురగి రైల్వేస్టేషన్ గోడలపై ఆకుపచ్చ రంగు వేయడం హిందూ సంఘాల ఆగ్రహానికి కారణమైంది. దీనికి వ్యతిరేకంగా మంగళవారం నాడు వారు నిరసన ప్రదర్శన నిర్వహించారు. హిందూ సంఘాలు రైల్వే స్టేషన్ ముందు మంగళవారం ఉదయం ఆకుపచ్చ పెయింట్‌ను వెంటనే తొలగించాలని నిరసనకు దిగాయి.
ఈ ఆకుపచ్చరంగుతో కలబురగి రైల్వే స్టేషన్ మసీదులా ఉందని వారు ఆరోపించారు. మైనారిటీ వర్గాలను మభ్యపెట్టేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్బంగా లక్ష్మీకాంత సాధ్వి అనే హిందూ కార్యకర్త మాట్లాడుతూ రైల్వే స్టేషన్‌కు ఆకుపచ్చ రంగు కాకుండా ఏదైనా రంగు వేయాలి. కన్నడ జెండాలోని పసుపు మరియు ఎరుపు రంగులను కూడా ఉపయోగించవచ్చు. లేకుంటే రైల్వే భవనానికి కాషాయ రంగు వేయాలని సూచించారు.
హిందూ సంఘాల ఆగ్రహంతో రైల్వే అధికారులు దిగి వచ్చారు. ప్రస్తుతం ఉన్న ఆకుపచ్చ రంగుపై మరొక పొరను కూడా చిత్రీకరించారు.ఇప్పుడు దానిని తెలుపు రంగులోకి మార్చారు. పోలీసు సిబ్బంది సమక్షంలో ఈ రంగుమార్పు చేసారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే పెయింటింగ్‌ను చేపట్టామని అధికారులు తెలిపారు.