Published On:

V.Hanumantha Rao: అప్పట్లో ఫ్యాక్షన్ మర్డర్లు.. ఇప్పుడు లవ్ మర్డర్లు : వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

V.Hanumantha Rao: అప్పట్లో ఫ్యాక్షన్ మర్డర్లు.. ఇప్పుడు లవ్ మర్డర్లు : వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

V.Hanumantha Rao Sensational Comments: సమాజంలో జరుగుతున్న దారుణాల పట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాజంలో భర్తలను భార్య, తల్లిని బిడ్డ హత్య చేయడం చూస్తుంటే బాధ వేస్తోందన్నారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ మర్డర్లు జరిగేవని, ఇప్పుడు లవ్ మర్డర్లు జరుగుతున్నాయని చెప్పారు. అబ్బాయి, అమ్మాయి ఇద్దరికి నచ్చకపోతే వివాహం చేసుకోవద్దని సూచించారు. తమకు నచ్చిన వారినే పెళ్లి చేసుకోవాలని కోరారు. సమాజం ఎక్కడికి పోతుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. యమధర్మ రాజుతో కూడా భర్త కోసం కొట్లాడిన భార్యలను చూశానని చెప్పారు. కానీ, ఇప్పుడు జరుగుతున్న హత్యలు చూస్తుంటే మానవ సంబంధాలు ఎటు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాత రోజులే బాగుండేవని అన్నారు.

 

సోషల్ మీడియాలో ఇలాంటి ఘటనలు ఎక్కువ ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిని హీరోయిజం అనుకుంటున్నారని ఆయన వాపోయారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కో లివింగ్ పేరిట అడ్డదార్లు తొక్కుతున్నారని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు దీనిపై ఆలోచన చేయాలన్నారు. ఇలాంటి వాటిని అరికట్టాలని ఆయన కోరారు. అమ్మాయి, అబ్బాయి ఒకే రూంలో ఉండే విధానం బాగాలేదన్నారు. దీనిపై ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. లేకపోతే ఇలాంటి హత్యలు జరుగుతూనే ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి షీ టీమ్‌తో చర్చలు జరపాలని కోరారు. సమాజంలో ఉన్న విద్యావేత్తలు, డాక్టర్లు ఆలోచన చేసి దారుణాలను అరికట్టడానికి కృషి చేయాలన్నారు.

 

గద్వాలలో ఐశ్వర్య అనే యువతి సర్వేయర్ తేజేశ్వర్‌ను వివాహం చేసుకుని ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసిన విషయం తెలిసిందే. వివాహం అయిన నెల రోజులకే దారుణానికి ఒడికట్టింది. అంతకుముందు ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీని ఇష్టం లేని వివాహం చేసుకున్న సోనమ్ హనీమూన్ కోసమని మేఘాలయకు తీసుకెళ్లి ప్రియుడితో కలిసి కిరాయి హంతుకులతో హత్యచేయించింది. మంగళవారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పదో తరగతి బాలిక తన ప్రియుడితో ప్రేమ వివాహానికి ఒప్పుకోవడం లేదని తల్లిపై కక్షగట్టి ప్రియుడి సాయంతో దారుణంగా హత్యచేసింది. రోజుల వ్యవధిలోనే వరుస ఘటనలు జరుగుతుండడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి: