NITI Aayog: జపాన్‌ను అధిగమించి.. నాలుగో ఆర్థిక శక్తిగా భారత్: నీతి ఆయోగ్ సీఈవో!
India as the 4th Largest Economic Power: ప్రపంచంలో జపాన్‌ను అధిగమించి ఇండియా నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. దేశ స్థూల దేశీయోత్పత్తి (ఈడీపీ) 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంతో అమెరికా, చైనా, జర్మనీ తర్వాత స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. పదో నీతి ఆయోగ్ పాలకమండలి భేటీ అనంతరం మాట్లాడారు. ప్రపంచ అస్థిరత, సవాళ్ల నేపథ్యంలో ఇండియా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతూ ఒక మార్గదర్శిగా నిలుస్తోందన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా దేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుండటంతో ఘనత సాధ్యమైందన్నారు.
దేశ ఆర్థిక వృద్ధిని తెలియజేసే ఐఎంఎఫ్ (ఐఎంఎఫ్) అంచనాలను ఉటంకిస్తూ అగ్రరాజ్యం అమెరికా, చైనా, జర్మనీ దేశాలు మాత్రమే ప్రపంచ ఆర్థిక ర్యాంకింగ్స్‌లో మన దేశంకంటే ముందు ఉన్నాయన్నారు. ఇలాగే మనం ముందుకు సాగితే మరో మూడేళ్లలో జర్మనీని దాటి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని పేర్కొన్నారు. ఇందుకోసం మూలధన వ్యయాల పెంపు, సులభతర వ్యాపార నిర్వహణ, వ్యాపార నిర్వహణ ఖర్చులు తగ్గడం, కార్మికులతో తయారీకి ప్రాధాన్యం, ప్రపంచ మార్కెట్‌పై దృష్టి సారించడం వంటి చర్యలు ఎంతో కీలకమన్నారు. ప్రస్తుతం వృద్ధి చెందుతున్న దేశీయ డిజిటల్ మార్కెట్ అని, రాబోయే దశాబ్ద కాలంలో భారత చాలా కీలకమన్నారు.
ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. వికసిత్ భారత్ వైపు అతిపెద్ద అడుగు అన్నారు. దీనిని సాకారం చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కొన్నేళ్ల తర్వాత భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.