Published On:

Ponguleti Srinivasa Reddy: ముగిసిన రెవెన్యూ స‌ద‌స్సులు.. మూడు విడ‌త‌ల్లో 8.58 ల‌క్ష‌ల‌ ద‌ర‌ఖాస్తులు

Ponguleti Srinivasa Reddy: ముగిసిన రెవెన్యూ స‌ద‌స్సులు.. మూడు విడ‌త‌ల్లో 8.58 ల‌క్ష‌ల‌ ద‌ర‌ఖాస్తులు

Minister Ponguleti Srinivasa Reddy: పదేళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలో రెవెన్యూ వ్య‌వ‌స్ధ‌ను విధ్వంసమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్ర‌క్షాళ‌న చేస్తున్నామ‌ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. గతంలో ఏళ్ల‌ త‌ర‌బ‌డి తెలంగాణ ప్ర‌జానీకం ఎదుర్కొన్న భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం తీసుకొచ్చేందుకు భూ భార‌తి చ‌ట్టాన్ని ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తున్నామ‌న్నారు. ఇందులో భాగంగానే రెవెన్యూ వ్య‌వ‌స్ద‌లో భూ భార‌తికి రాక ముందు భూ భార‌తి వచ్చిన త‌ర్వాత స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తుంద‌న్నారు.

 

రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ స‌ద‌స్సులు ముగిశాయి. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి శ‌నివారం అధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం 2020లో ఎంతో గొప్ప‌గా తీసుకొచ్చిన ఆర్ఓఆర్ చ‌ట్టంలో లోపాలున్నాయన్నారు. ఈ చట్టాన్ని తిర‌గ‌రాసి పార‌ద‌ర్శ‌క పాల‌న‌కు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద‌పీట వేస్తుందన్నారు. ఈ మేరకు రైతుల సమస్యలు తీర్చేందుకు భూభార‌తి చ‌ట్టాన్ని తీసుకొచ్చామ‌న్నారు. బీఆర్ఎస్ పాలనలో ప‌దేళ్ల‌ పాటు రైతులు నానా క‌ష్టాలు పడ్డామని ఇటీవల నిర్వ‌హించిన రెవెన్యూ స‌ద‌స్సుల్ఇంలో వాపోయారన్నారు. మొత్తం మూడు ద‌శ‌ల్లో ఇప్పటివరకు 10ల‌క్ష‌లకు పైగా భూ స‌మ‌స్య‌ల‌ దర‌ఖాస్తులు వ‌చ్చినట్లు పేర్కొన్నారు.

 

సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా భూభారతి చట్టాని ఏప్రిల్ 14వ తేదీన తీసుకొచ్చారన్నారు. అప్పుడే రెవెన్యూ విధానంలో కొత్త శకం ప్రారంభమైందన్నారు. ఈ చ‌ట్టాన్ని ద‌శ‌ల వారీగా అమ‌లులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. మొద‌టి ద‌శ‌లో ఏప్రిల్ 17 నుంచి 30వ తేదీ వ‌ర‌కు మొత్తం 4మండ‌లాల్లో నిర్వ‌హించామన్నారు. ఇందులో 72 రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వహించగా.. 12వేల ద‌ర‌ఖాస్తులు వచ్చాయన్నారు. అలాగే, రెండ‌వ‌ ద‌శ‌లో మే 5వ తేదీ నుంచి 28 మండ‌లాల్లో నిర్వ‌హించామన్నారు. ఇందులో మొత్తం 414 స‌ద‌స్సుల్లో 46 వేల ద‌ర‌ఖాస్తులు అందాయన్నారు. ఇందులో నుంచి సుమారు 60 శాతానికి పైగా స‌మ‌స్యల‌కు పరిష్కరించినట్లు చెప్పారు.

 

ఆ తర్వాత జూన్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వ‌ర‌కు 561 మండ‌లాల్లో 10,239 గ్రామాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హించామ‌న్నారు. ఈ సదస్సులకు 8 ల‌క్ష‌లకు పైగా ద‌ర‌ఖాస్తులు అందాయ‌న్నారు. మొత్తం మూడు విడ‌తల్లో 593 మండలాల్లో 10,725 రెవెన్యూ సదస్సులు నిర్వహించి రికార్డు నెలకొల్పామన్నారు. మొత్తం 8.58 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు రాగా, అత్య‌ధికంగా ఖ‌మ్మం జిల్లాలో 67వేలు వచ్చాయన్నారు. ఆ తర్వాత భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో 61వేలు, వ‌రంగ‌ల్ లో 54 వేలు, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లిలో 48వేలు, నల్గొండలో 42 వేల ద‌ర‌ఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ దరఖాస్తుల్లో ఇప్ప‌టికీ 3.27 ల‌క్ష‌ల ద‌రఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో న‌మోదు చేశామన్నారు. మిగిలిన దరఖాస్తులను సైతం త్వరలోనే న‌మోదు చేసేందుకు అధికారుల‌కు సూచించామన్నారు.

ఇవి కూడా చదవండి: