Published On:

Rythu Bharosa Funds: మూడోరోజు.. నాలుగెకరాల వరకు రైతుభరోసా నిధులు జమ: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Rythu Bharosa Funds: మూడోరోజు.. నాలుగెకరాల వరకు రైతుభరోసా నిధులు జమ: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Tummala Nageswara Rao on Rythu Bharosa Funds: తెలంగాణలో రైతుభరోసా పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ కొనసాగుతోంది. మూడోరోజు బుధవారం నాలుగెకరాల లోపు ఉన్న రైతులకు రైతుభరోసా నిధులు జమ కోసం ప్రభుత్వం రూ.1,313.53 కోట్లు రిలీజ్ చేసింది. 21.89 లక్షల ఎకరాలకు సంబంధించి 6.33 లక్షల మంది రైతన్నలు లబ్ధిపొందుతున్నారు. ఇప్పటి వరకు రూ.5215.26 కోట్లు రైతుభరోసా కోసం నిధులు విడుదల చేసింది. 58.04 లక్షల మంది రైతన్నలకు సాయం అందించింది.

 

తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వరుసగా మూడోరోజు రైతుభరోసా నిధులు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఎకరాలతో సంబంధం లేకుండా సాగుకు యోగ్యమైన అన్ని భూములకు సాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. రైతుభరోసా విషయంలో బీఆర్ఎస్ నాయకులకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు.

 

గతంలో బీఆర్ఎస్ సర్కారు ఒక సందర్భంలో మినహా వానాకాలం రైతుబంధు సాయం ఎప్పుడూ సాగు కాలానికి ముందుగా ఇవ్వలేకపోయిందన్నారు. ప్రతిసారి ఆలస్యంగా రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లోకి జమ చేసిందన్నారు. రైతుభరోసా పథకం కింద ఎకరాకు రూ.5వేల నుంచి రూ.6 వేలకు పెట్టుబడి సాయం పెంచి రైతులకు అందజేస్తున్నామని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇవ్వాల్సిన యాసంగి సీజన్ సంబంధించిన రైతుబంధు నిధులు ఇవ్వకుండా గత బీఆర్ఎస్ సర్కారు వదిలేస్తే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు కూడా చెల్లించామని గుర్తుచేశారు.

 

అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే దాదాపు రూ.77,000 కోట్లు రైతు సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వానాకాలం రైతుభరోసా నిధులు జమ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా తొమ్మిది రోజుల్లో రైతుభరోసా సాయం పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు ఆత్మ విమర్శ చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. లేకపోతే రైతాంగం ఎప్పటికీ క్షమించదన్నారు.

 

ఇవి కూడా చదవండి: