Published On:

Pashamylaram: పాశమైలారం ఘటన.. 13కి చేరిన మృతులు

Pashamylaram: పాశమైలారం ఘటన.. 13కి చేరిన మృతులు

Pashamilaram: సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 13కి చేరింది. మరో 30 మందికిపైగా గాయాలయ్యాయి. భవనం, శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వెలికితీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో దాదాపు 108 మంది కార్మికులు ఉన్నట్లు తెలిపారు. క్షతగాత్రుల్లో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

 

ఇవాళ పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది. సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో పలువురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో ఘటన స్థలింలోనే ఐదుగురు మృతి చెందారు. మరో 8 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం కూలిపోయింది. మరో భవనానికి బీటలు వచ్చాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో అక్కడి పరిస్థితి భీతావహంగా మారింది.

 

పరిశ్రమల భద్రతపై త్వరలో కమిటీ..
పరిశ్రమల్లో భద్రతపై త్వరలో కమిటీ వేస్తామని మంత్రి వివేక్‌ తెలిపారు. అధిక పని గంటలపై కార్మికులు ఫిర్యాదు చేస్తే లేబర్‌ కమిషన్‌ దర్యాప్తు చేస్తుందన్నారు. మరోవైపు సిగాచి పరిశ్రమ ఘటన దురదృష్టకరమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత అన్ని విభాగాల అధికారులు తక్షణమే స్పందించారని, ప్రమాదానికి గల కారణాలను ఇప్పుడే చెప్పలేమన్నారు. పరిశ్రమలో మైక్రో క్రిస్టలైన్‌ సెల్యులోజ్‌ అనే పౌడర్‌ తయారు చేస్తున్నట్లు చెప్పారు. 40 ఏళ్లుగా సంస్థ పని చేస్తోందని తెలిపారు.

ఇవి కూడా చదవండి: