PV Narasimha Rao: పీవీకి సీఎం రేవంత్ నివాళి

Tribute to pv narasimha rao: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. పీవీ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు సీఎం. బహుభాషాకోవిదుడిగా, రచయితగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా ఆయన దేశానికి ఎనలేని సేవలను అందించారని కొనియాడారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో పీవీ పాత్ర ఎనలేనిదన్నారు. సీఎంతో పాటు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేంద్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి.. పీవీకి నివాళులు అర్పించారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా.. నెక్లెస్ రోడ్‌లోని పీవీ ఘాట్ వద్ద డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాళులర్పించారు. అందరికీ ఒకే రకమైన విద్యాబోధన ఉండాలని, ఈ దేశ మొట్టమొదటి మానవ వనరుల శాఖ మంత్రిగా ప్రజాస్వామ్య భావనకు పీవీ నరసింహారావు పునాదులు వేశారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. నాడు పంచిన భూములను తిరిగి స్వాధీనం చేసుకొని, పేదల అస్తిత్వాన్ని, హక్కులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని భట్టి విక్రమార్క అన్నారు. పీవీ నరసింహారావు మార్గాన్ని ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తూచా తప్పకుండా అమలు చేస్తుందని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.