Pawan Varahi: జనసేన ప్రచార రథం వారాహి వాహనం కలర్ పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. కనీసం నేను ఆలివ్ గ్రీన్ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు తనను అడుగడుగునా అడ్డుకుంటున్నారని కావాలనే ప్రతి చిన్న విషయానికి పెద్ద రచ్చ చేస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
మొదట్లో తన సినిమాలను అడ్డుకున్నారని.. ఆ తర్వాత తాను విశాఖ పర్యటనకు వెళ్లినప్పుడు వాహనం నుంచి, హోటల్ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారని, సిటీ నుంచి వెళ్లిపోవాలని తనను ఒత్తిడి చేశారని పవన్ దుయ్యబట్టారు. తాడేపల్లి నుంచి ఇప్పటం బాధితులను కలవడానికి వెళ్తుంటే అప్పుడు కూడా తన వాహనం వెళ్లకుండా అడ్డుకున్నారని, కనీసం నడుచుకుంటూ వెళ్లే స్వేచ్ఛ కూడా లేకుండా అనేక ఆటంకాలు కలిగించారని మండిపడ్డారు. ఇప్పుడు తన ప్రచార రథం వారాహి విషయంలో కూడా వైసీపీ నేతలు వివాదాన్ని సృష్టిస్తున్నారని అన్నారు. కనీసం ఈ ఆలివ్ గ్రీన్ చొక్కాను అయినా వేసుకోనిస్తారా వైసీపీ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలివ్ గ్రీన్ కలర్ లో ఉన్న చొక్కా ఫొటోను షేర్ చేస్తూ ఆయన వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. నన్ను ఊపిరి తీసుకోవడం కూడా ఆపేయమంటారా? అని ప్రశ్నించారు.
Am I allowed to wear this shirt ‘YCP’? At least…?? pic.twitter.com/2ybkgx9LXV
— Pawan Kalyan (@PawanKalyan) December 9, 2022
పవన్ వారాహి వాహనంపై నిన్న మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు. యుద్ధం చేయడానికి వ్యాన్లు ఎందుకని.. ఎన్నికల్లో ఇలాంటి వ్యాన్లతో యుద్ధాలు చేస్తారా.. అలా అయితే నేను కూడా అలాంటి వ్యాన్ ఒకటి కొనేవాడిని కదా అంటూ పవన్ పై సెటైర్ వేశారు. వారాహి అనే పేరుతో ఏదో వీడియో వస్తే ఇదేదో సినిమా టీజర్ అని అనుకున్నాననంటూ వ్యంగ్యాస్త్రాలు వేశారు. వందల పుస్తకాలు చదువుతుంటా అని చెప్పడం కాదని ఒకసారి ఇండియన్ మోటార్ వెహికల్ చట్టాన్ని కూడా చదివితే బాగుంటుందంటూ పవన్ కు పేర్ని నాని సూచించారు. అయితే ఈ వారాహి వాహనం చూడడానికి అచ్చంగా మిలట్రీ వాహనం మాదిరిగా ఉంది. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం సొంత వాహనాలకు ఆలీవ్ గ్రీన్ కలర్ వేయకూడదని, అలా వేస్తే వాహనం రిజిస్ట్రేషన్ కూడా అవ్వదు. ఈ రంగుకు బదులుగా ముందే వాహనానికి పసుపు రంగు వేసుకుంటే ఖర్చు కూడా కలిసి వస్తుంది కదా అంటూ పేర్ని నాని పవన్‌పై సెటైర్లు వేశారు.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ ‘వారాహి’ టార్గెట్ చేసిన ఆ రక్త బీజుడు ఎవరు?