CBSE: కీలక నిర్ణయం.. ఇక ఏడాదికి రెండుసార్లు పదో తరగతి బోర్డు పరీక్షలు

CBSE: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి బోర్డు పరీక్షను ఏడాదికి రెండుసార్లు నిర్వహించే నియమాలను ఆమోదించింది. ఇప్పుడు పదో తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు సీబీఎస్‌ఈ నిర్వహిస్తుంది. ఈ అంశంపై పరీక్షల కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ మాట్లాడారు. రెండుసార్లు పరీక్షలు నిర్వహించే నమూనాను సీబీఎస్‌ఈ ఆమోదించిందని తెలిపారు. ఈ ఏడాది మొదటి పరీక్ష ఫిబ్రవరిలో, రెండో పరీక్ష మే నెలలో జరుగుతాయని వెల్లడించారు. ఫిబ్రవరిలో జరిగిన పరీక్ష ఫలితాలను ఏప్రిల్‌లో, మేలో జరిగిన పరీక్ష ఫలితాలను జూన్‌లో ప్రకటిస్తామని తెలిపారు.
పదో తరగతి బోర్డు పరీక్ష విద్యార్థులు మొదటి పరీక్షకు హాజరు కావడం తప్పనిసరి చేసింది. రెండో విడత పదో తరగతి పరీక్షలను ఆప్షనల్‌గా పెట్టింది. రెండు విడతల్లో మంచి స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. విద్యార్థులు తమ ఇష్టానుసారం రెండో బోర్డు పరీక్షలో పాల్గొనవచ్చు. మొదటిసారి మార్కులు తగ్గితే, మళ్లీ రెండోసారి రాసి మెరుగుపర్చుకోవచ్చు. మొదటి పరీక్షలో ఎక్కువ మార్కులు, రెండో పరీక్షలో తక్కువ మార్కులు సాధిస్తే మొదటి పరీక్షలో పొందిన మార్కులను ఫైనల్‌గా పరిగణిస్తారు. ముసాయిదా ప్రకారం.. మొదటి పరీక్ష ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6 మధ్య, రెండో దశ పరీక్షలు మే 5 నుంచి 20 వరకు జరుగుతాయని పేర్కొంది.