Pawan Kalyan: వారాహి వృథా కాదు.. పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: రానున్న 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన ముద్ర వేస్తుందనే నమ్మకాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. తొలి విడత వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసిన పవన్ కళ్యాణ్.. నేటి నుంచి రెండో విడత వారాహి విజయ యాత్రకు సిద్ధం అవుతున్నారు
Pawan Kalyan: రానున్న 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన ముద్ర వేస్తుందనే నమ్మకాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. తొలి విడత వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసిన పవన్ కళ్యాణ్.. నేటి నుంచి రెండో విడత వారాహి విజయ యాత్రకు సిద్ధం అవుతున్నారు. ఇక, ఈ రోజు వారాహి యాత్ర కమిటీలతో ప్రత్యేకంగా సమావేశమైన పవన్ కళ్యాణ్ జరుగనున్న రెండో విడత యాత్రకు సంబంధించిన విధివిధానాలను చర్చించారు. మొదటి విడత వారాహి యాత్ర జరిగిన విధానంపై క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ వారాహి యాత్ర కోసం పడిన కష్టం వృథా కాదని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన బలమైన ముద్ర వేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజాకంటక పాలనకు విముక్తి ఈ ఉభయ గోదావరి జిల్లాల నుంచే ప్రారంభమవుతుందని పవన్ వెల్లడించారు. రెండో విడత యాత్రను కూడా ఇదే పట్టుదలతో విజయవంతం చేయాలని జనసైనికులకు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. మనం ఎంత బలంగా ముందుకెళ్తే.. రాష్ట్రానికి అంత మేలు జరుగుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.
పొత్తులపై క్లారిటీ(Pawan Kalyan)
అంతేకాకుండా పొత్తులపై కూడా ఇప్పుడే ఏమీ చెప్పలేమని, అందుకు చాలా సమయం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. అన్ని అంశాలపై, అన్ని కోణాల్లో, సమగ్రంగా చర్చించాకే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. పొత్తుల విషయంలో మండల స్థాయి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు. బలంగా పనిచేస్తే అధికారం దానంతట అదే వస్తుందని జనసేన శ్రేణులకు పవన్ సూచించారు.
ఇకపోతే నేటి నుంచి రెండో దశ వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. ఏలూరు నుంచి తన యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు జనసేనాని. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఏలూరు, పాత బస్టాండ్ అంబేద్కర్ కూడలిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇక, 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఏలూరులో జనవాణి కార్యక్రమం ఆరోజు సాయంత్రమే 6 గంటలకు ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం కానున్నరు పవన్. 11వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు దెందులూరు నియోజకవర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో భేటీ అయ్యి ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెం చేరుకుంటారు. ఇక, 12వ తేదీన సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెంలో బహిరంగ సభలో ప్రసంగంతో జనసేనాని పవన్ కళ్యాణ్ రెండో విడత నాలుగు రోజుల వారాహి యాత్ర షెడ్యూల్ ముగియనుంది.