Accident News : ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. సాగర్ కెనాల్ లోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు.. 7 మృతి, 30 మందికి గాయాలు
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జిల్లాలోని దర్శి దగ్గర సాగర్ కెనాల్ లో అదుపుతప్పి పెళ్లి బృందం బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో 30 మందికి గాయాలయ్యాయి. పొదిలి నుంచి కాకినాడకు వివాహ రిసెప్షన్ కోసం వెళుతుండగా
Accident News : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జిల్లాలోని దర్శి దగ్గర సాగర్ కెనాల్ లో అదుపుతప్పి పెళ్లి బృందం బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో 30 మందికి గాయాలయ్యాయి. పొదిలి నుంచి కాకినాడకు వివాహ రిసెప్షన్ కోసం వెళుతుండగా డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లినట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలిసింది. కాగా మృతుల్లో ఐదుగురు మహిళలు, ఓ చిన్నారి, ఓ యువకుడు ఉండడం మరింత విషాదానికి గురి చేస్తుంది.
బస్సులోని వారంతా పొదిలిలో సోమవారం జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరై కాకినాడలో రిసెప్షన్ కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులో బయలుదేరినట్లు చెబుతున్నారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో బోల్తా పడిన బస్సును బయటకు తీశారు.
మృతులు అబ్దుల్ అజీజ్ (65) అబ్దుల్ హనీ (60), షేక్ రమీజ్ (48), ముల్లా నూర్జహాన్ (58), ముల్లా జానీబేగం (65), షేక్ షబీనా (35), షేక్ హీనా(6)లుగా గుర్తించారు. అయితే మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నట్టుగా తెలిసింది. బస్సు కింద నీళ్లలో చిక్కుకున్న ఆరేళ్ల పాప షేక్ హీనా మృతదేహాన్ని అతి కష్టం మీద బయటకు తీశారు. ఈ విషాద వార్తతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.