Pawan Kalyan: పవన్ పేషీకి బెదిరింపులు..మల్లికార్జున రావుగా గుర్తింపు.. నిందితుడి అరెస్ట్..
Man Arrested For Threatening Call For Pawan Kalyan: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను చంపేస్తామంటూ ఆయన పేషీకి ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. సోమవారం జనసేనాని కార్యాలయానికి ఓ ఆగంతకుడు ఫోన్ కాల్స్ చేయడంతో పాటు సందేశాలు పంపించడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఈ కేసులో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు. పలు కోణాల్లో అతడిని పోలీసులు విచారిస్తున్నారు.
నిందితుడి అరెస్ట్..
కాగా, పవన్‌కల్యాణ్ పేషీకి 9505505556 నంబరు నుంచి కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నంబరు ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన మల్లికార్జునరావు పేరుతో ఉందని తెలుసుకున్న పోలీసులు, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద టవర్ నుంచి కాల్స్ వచ్చినట్లు తేల్చారు. వెంటనే నగర కమిషనర్ రాజశేఖర్‌బాబు టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచి, లా అండ్ ఆర్డర్ విభాగాలకు చెందిన పోలీసులతో నాలుగు బృందాలను రెడీ చేసి గాలింపు చేపట్టారు. తొలుత ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో తిరువూరులోనూ గాలింపు చేపట్టారు. మొత్తానికి.. మంగళవారం ఉదయానికి లబ్బిపేట వాటర్ ట్యాంక్ రోడ్‌లో నిందితుడిని అరెస్ట్ చేసి, స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నెల్లూరు వాసి..
మల్లికార్జునరావు తిరువూరులో ప్రముఖ వైద్యుడికి బావ మరిది అవుతారని తెలుస్తోంది. చెడు వ్యసనాలకు బానిసవడంతో నిందితుడి భార్య ముందే అతడిని వదిలేసి పోయనట్లు గుర్తించారు. నెల్లూరులో నివాసం ఉంటూ డబ్బుల కోసం అతను తరచూ తిరువూరులోని బావ దగ్గరకు వచ్చిపోతుంతాడని, రెండు రోజుల క్రితమే అతడు నెల్లూరు నుంచి తిరువూరు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అతడికి మానసిక సమస్యలు కూడా ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి విజయవాడలోనే తిరుగుతూ, మద్యం మత్తులో పవన్ పేషీకి ఫోన్ కాల్స్ చేసినట్లు తెలుస్తోంది.
కొనసాగుతున్న దర్యాప్తు
పవన్ కళ్యాణ్ పేషీ నంబర్లు ఎలా దొరికాయి? ఫోన్ చేసి ఏమేం మాట్లాడాడు? గతంలో ఇలాగే ఎవరికైనా ఫోన్లు చేశాడా? ఈ బెదిరింపుల వెనక ఎవరి హస్తమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే గతంలో హోంమంత్రి అనితకు సైతం ఇదే నంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. వైజాగ్‌లో నూక మల్లిఖార్జునపై 354 కేసు నమోదు అయినట్లు కూడా పోలీసులు గుర్తించారు.