Andhra Pradesh: బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే రెండురోజులు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది. ఒడిశా–ఏపీ తీరం మీదుగా ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వైపు కదులుతోంది. మొన్నటి వరకు ఇది ఏపీ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర వైపు కదిలింది. ఇది భూమిపైనే కొనసాగుతూ రెండ్రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
Andhra Pradesh: బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది. ఒడిశా–ఏపీ తీరం మీదుగా ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వైపు కదులుతోంది. మొన్నటి వరకు ఇది ఏపీ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర వైపు కదిలింది. ఇది భూమిపైనే కొనసాగుతూ రెండ్రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ తీవ్రరూపం దాల్చకపోయినా అల్పపీడనంగానే 4, 5 రోజులపాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
దీని ప్రభావంతో నైరుతి రుతు పవనాలు చురుగ్గా మారాయి. ఫలితంగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వచ్చే రెండ్రోజులు ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, సోమవారం అల్లూరి జిల్లాలో 1.2 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. ముంచంగిపుట్టు మండలం బోరంగులలో 5.3 సెం.మీ. అత్యధిక వర్షం కురిసింది. అరకు లోయ, పాడేరు, చింతూరు, హుకుంపేటలలో 3 నుంచి 3.5 సెం.మీ. వర్షం పడింది.