Cm Revanth Reddy: హాస్టళ్ల విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుక్కోండి.. లేదంటే చర్యలు.. అధికారులపై సీఎం ఫైర్
CM Revanth Reddy fire on Food poisoning: గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను కన్న బిడ్డల్లా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై వేటు వేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
పాఠశాలలు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలని అధికారులకు చెప్పారు. పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందించాలన్నారు. ప్రభుత్వాన్ని కావాలని అప్రతిష్టపాలు చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని, వెంటనే అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనికి సంబంధించిన బాధ్యులను త్వరలోనే పట్టుకొని వారికి చట్టప్రకారం శిక్ష పడేలా చేస్తామన్నారు.
గత కొంతకాలంగా వదంతులు సృష్టిస్తున్నారని, ఇలాంటి ఘటనలతో భయాందోళనలు సృష్టిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హాస్టళ్లను నిరంతరం తనిఖీలు చేయాలని, ప్రస్తుతం కలుషితాహారం ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉద్యోగాల నుంచి తొలగించేందుకు సైతం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఉన్నతమైన చదువు కోసం ఇప్పటికే వేల సంఖ్యలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని, డైట్ ఛార్జీలు కూడా పెంచినట్లు గుర్తు చేశారు.
ఇదిలా ఉండగా, నారాయణపేట జిల్లాలోని మాగనూరు జెడ్పీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. మధ్యాహ్న భోజన సమయంలో కొంతమంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ మేరకు నారాయణ పేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికలు. బాలుర వసతి గృహాలను తనిఖీ చేశారు. అనంతరం ఆహార పదార్థాలు, మెనూను పరిశీలించారు.