Last Updated:

Andhra Pradesh: ఏపీలో మరోసారి నదుల అనుసంధానం.. మూడేళ్లలో పూర్తిచేసేందుకు ప్రయత్నం

Andhra Pradesh: ఏపీలో మరోసారి నదుల అనుసంధానం.. మూడేళ్లలో పూర్తిచేసేందుకు ప్రయత్నం

Andhra Pradesh to interlink rivers with Godavari-Banakacherla project: గోదావ‌రి జ‌లాల‌ను రాయ‌ల‌సీమ‌కు త‌ర‌లించటం ద్వారా ఆ ప్రాంతాన్ని శాశ్వతంగా కరువు నుంచి విముక్తి చేయటమే గాక సస్యశ్యామలం చేయటం సాధ్యమవుతుందని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నూతనంగా ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు తెలుగుతల్లికి జలహారతి అనే పేరును నిర్ధారించారు.

ప్రాజెక్టు ఇందుకే..
రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగితే రతనాల సీమ అవుతుందని, వ్యవసాయాధారిత రంగంలో మరెన్నో ఉపాధి అవకాశాలు వస్తాయని సీఎం తెలిపారు. ఏటా రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఏదో ఒక చోట తీవ్రమైన కరువు తాండవిస్తోందని , ఈ కొత్త ప్రయోగంతో ఆ పరిస్థితికి చెక్ పెట్టొచ్చని వివరించారు. కృష్ణా నదిపైన ఎగువ రాష్ట్రాలలో పలు ప్రాజెక్టులు ఉండటంతో ఈ నదిలో తగినంత నీటి లభ్యత లేదని, ఈ ఏడాది 4,114 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలోకి వెళ్లాయని, ఆ మిగులు నీటిని సీమకు వాడుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

3 దశలు.. రూ. 80 వేల కోట్లు
మూడు దశల్లో బనకచర్ల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో పోలవరం నుంచి కృష్ణా నదికి నీరు మళ్లించడం మొదటి దశగా ఉంటుంది. రెండో దశలో బొల్లాపల్లి జలాశయం నిర్మించి అక్కడికి నీళ్లు తరలిస్తారు. ఇక, చివరి దశలో బొల్లాపల్లి జలాశయం నుంచి బనకచర్లకు నీటిని మళ్లిస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, సీమ జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు లబ్ధి చేకూరుతుంది. సుమారు రూ.80 వేల కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే రాష్ట్రానికి భవిష్యత్తులో ఆదాయం, ఉపాధి లభించనున్నాయి. కేంద్రం సాయంతో, ఇతర ఆర్థిక వనరులు సమకూరితే.. మూడు సంవత్సరాల్లోనే దీనిని పూర్తి చేయవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీని గురించి ప్రధాని, కేంద్ర ఆర్థికమంత్రితో మాట్లాడామని, హైబ్రిడ్‌ మోడల్‌లో నిధుల సమీకరణకు ఆలోచిస్తున్నామని సీఎం తెలపారు.

48 వేల ఎకరాలు కావాలి..
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుతో 80 లక్షల మందికి తాగునీరు లభించటంతో బాటు 7.5 లక్షల ఎకరాలు సాగులోకి రానుంది. అలాగే, ఈ ప్రాజెక్టు కోసం 48వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. రోడ్ల నిర్మాణంలో అమలులో ఉన్న పీపీపీ విధానం మాదిరిగా దీనిని నిర్మించాలనే యోచన కూడా ఉందని సీఎం వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ పూర్తి చేసి 2-3 నెలల్లో టెండర్లు పిలవబోతున్నామని ప్రకటించారు. గోదావరి నుంచి కనీసం 300 టీఎంసీల నీటిని కృష్ణా నదికి తీసుకురావాలని, అయితే, ముందుగా కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలోని డెల్టాలకు నీళ్లు ఇచ్చిన తర్వాతే …గోదావరిలోని మిగులు నీటిని బనకచర్లకు తరలిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇందులో వెలుగొండ ఆయకట్టు కూడా కవర్ అవుతుంద‌ని పేర్కొన్నారు.

ఏపీకి భారీగా పెట్టుబడులు..
కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీకి పెట్టుబడుల ప్రవాహం మొదలవుతోంది. గత ఆరునెలలలో చేసిన ప్రయత్నాల మూలంగా 2,63,411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా రాష్ట్రానికి రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు రానున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం వెల్లడించారు. . ఈ మేరకు సచివాలయంలో జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. నెల్లూరు జిల్లా రామాయపట్నంలో బీపీసీఎల్‌ 6 వేల ఎకరాల విస్తీర్ణంలో రూ.96,862 కోట్లతో వచ్చే రిఫైనరీ వల్ల 2,400 ఉద్యోగాలు, రానున్న 20 ఏండ్లలో రాష్ట్రానికి రూ.88 వేల కోట్ల ఆదాయం సమకూరనుంది. మొత్తం 9 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో 5 బ్లాకుల్లో ఈ రిఫైనరీ ఏర్పాటు కానుంది. ఇక.. విశాఖలో 2 వేల కొలువులతో మిలీనియం టవర్స్‌లో రూ.80 కోట్ల పెట్టుబడితో రానున్న టీసీఎస్ కేంపస్, రూ. వెయ్యి కోట్లతో శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్‌ మొబిలిటీ ఇండియా లిమిటెడ్‌ సంస్థ ఏర్పాటు, అనకాపల్లి జిల్లాలో 106 ఎకరాల్లో రూ.1174 కోట్ల పెట్టుబడితో రానున్న ఇంధన రంగ సంస్థల ప్రాజెక్టులకు సైతం సీఎం ఆమోదం తెలిపారు. గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా రూ.83 వేల కోట్ల పెట్టుబడులతో వచ్చే పలు సంస్థల వల్ల రాష్ట్రానికి దాదాపు రూ.4వేల కోట్ల ఆదాయం సమకూరనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2028నాటికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

నేడు పల్నాడు పర్యటన
కూటమి ప్రభుత్వం ప్రతీ నెలా ఒకటో తేదీన పించన్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు.. మంగళవారం పల్నాడు జిల్లాలోని యల్లమంద గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఆ గ్రామంలోని తలారి శానమ్మ, మరో లబ్ధిదారుడు సురేష్‌ ఇంటికి వెళ్లి సీఎం స్వయంగా పించన్ అందించనున్నారు. కాగా సీఎం పర్యటన నేపథ్యంలో.. పల్నాడు జిల్లాలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.