Last Updated:

National Press Day: సత్యానికి కట్టుబడి సమాచార వ్యాప్తి చేయాలి.. విద్యార్థులకు సీనియర్ జర్నలిస్టు హితవు

మీడియా కలుషితం అయ్యిందని నిందిస్తూ, దాన్ని అదేపనిగా ప్రచారం చేస్తూ కూర్చోకుండా ప్రతి విద్యావంతుడు సమాచార వ్యాప్తిలో సత్యానికి కట్టుబడి ఉండాలని సీనియర్ జర్నలిస్టు, జర్నలిజం బోధకుడు డాక్టర్ ఎస్. రాము హితవు పలికారు.

National Press Day: సత్యానికి కట్టుబడి సమాచార వ్యాప్తి చేయాలి.. విద్యార్థులకు సీనియర్ జర్నలిస్టు హితవు

Hyderabad: మీడియా కలుషితం అయ్యిందని నిందిస్తూ, దాన్ని అదేపనిగా ప్రచారం చేస్తూ కూర్చోకుండా ప్రతి విద్యావంతుడు సమాచార వ్యాప్తిలో సత్యానికి కట్టుబడి ఉండాలని సీనియర్ జర్నలిస్టు, జర్నలిజం బోధకుడు డాక్టర్ ఎస్. రాము హితవు పలికారు. “సాంకేతిక సమాచార విప్లవం వల్ల, సోషల్ మీడియా కారణంగా ఇప్పుడు ప్రతి వ్యక్తీ జర్నలిస్టు అయ్యాడు. రాజకీయ పార్టీలకు మీడియా కొమ్ముకాసి సత్యాన్ని సమాధి చేస్తున్నదని నిత్యం బాధపడే బదులు, ప్రతి విద్యావంతుడు సమాచార సేకరణ, వ్యాప్తిలో సత్యానికి కట్టుబడి ఉండాలి. ప్రధాన మీడియాను ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్న సోషల్ మీడియాను విస్తృతంగా, బాధ్యతాయుతంగా వాడుకోవాలి,” అని అయన చెప్పారు.

జాతీయ ప్రెస్ డేను పురస్కరించుకుని వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞానజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్‌ టెక్నాలజీ (VNRVJIET) జర్నలిజం క్లబ్ ‘డియుర్నలిస్’ బుధవారం సాయంత్రం నిర్వహించిన వర్క్ షాప్‌లో డాక్టర్ రాము ప్రసంగించారు. ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ కాలేజ్‌లో చేరే ప్రతి విద్యార్థికీ కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్స్‌లో మొక్కుబడిగా కాకుండా, ప్రాక్టికల్‌గా సీరియస్ శిక్షణ ఇవ్వాలన్నారు. వరదలా ముంచుకొస్తున్న సమాచారాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు విద్యార్థులకు ఇవ్వాలని రాము సూచించారు.

కాలేజ్ ఇన్ హౌస్ న్యూస్ లెటర్ ఆసక్తికరంగా తేవడానికి ఎంతో కృషి చేయాలని డాక్టర్‌ రాము విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. కాలేజీల్లో, ఆఫీసుల్లో ప్రశాంతంగా పనిచేయడానికి మూడు ముఖ్యమైన టెక్నిక్స్‌ కావాలని విద్యార్థులకు వివరించారు. చిరునవ్వుతో మాట్లాడటం, ఇతరులు చెప్పే మాటలు వినడం, మంచిని ప్రోత్సహించడం ముఖ్యమని చెప్పారు. ప్రతి వ్యక్తీ దేశానికి ఉపకరించే మానవ వనరు అన్న దృక్పథంతో మెలగాలని డాక్టర్‌ రాము సూచించారు. ఈ వర్క్‌ షాప్‌లో ఫాకల్టీ అడ్వైజర్ డాక్టర్ టి. జేశ్రీ, కో-ఆర్డినేటర్ డాక్టర్ బి. ప్రత్యూష, జర్నలిజం క్లబ్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: