Last Updated:

Trump begins Mass Deportation: భారతీయులపై ట్రంప్‌ కొరడా.. మిలటరీ విమానం సీ-17లో తరలింపు

Trump begins Mass Deportation: భారతీయులపై ట్రంప్‌ కొరడా.. మిలటరీ విమానం సీ-17లో తరలింపు

Trump begins mass deportation of 18,000 Indian Migrants Using Military Planes: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు బిగ్ షాక్‌నిచ్చాడు. ఎన్నికల్లో చెప్పినట్లుగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. ఎన్నడూ లేనివిధంగా దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వారి ఏరివేతకు స్పెషల్ ఆపరేషన్‌‌ను అనుమతినిచ్చింది. దాదాపు 18వేల మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు అధికారులు లెక్కతేల్చారు. ఈ పరిణామంతో దొరికిన వారిని దొరికినట్లుగా విమానంలో స్వదేశానికి తరలించారు. 205 మంది భారతీయులతో కూడిన మిలిటరీ సీ-17 విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్‌ చేరుకోన్నది.

భారత్‌ విషయంలో ఇదే తొలి అడుగు..
ఇంతకు ముందు వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారులను వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. అయితే ఇండియా విషయంలో మాత్రం ఇదే తొలి అడుగు. వచ్చే వారం భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారులను వెనక్కి పంపే అంశంపై చర్చ జరిగే అవకాశం లేకపోలేదు.

సరైన పత్రాలు లేని ఏడున్నర లక్షల మంది..
అమెరికాలో సరైన పత్రాలు లేని భారతీయులు ఏడున్నర లక్షల మంది వరకు ఉన్నట్లు ఫ్యూ రీసెర్చ్‌ సెంటర్‌ అంచనా వేసింది. మెక్సికో, ఎల్‌ సాల్వడోర్‌ తర్వాత అత్యధికంగా భారతీయులే ఉన్నారు. వీళ్లందరినీ వెనక్కి పంపించే ప్రక్రియ కొనసాగుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో సుమారు 18 వేల మంది భారతీయులతో కూడిన తొలి జాబితాను అక్కడి ఇమ్మిగ్రేషన్‌ & కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రూపొందించినట్లు తెలుస్తోంది.

అధికార యంత్రాంగం చర్యలు..
అక్రమంగా అమెరికాకు వలస వచ్చినవారంతా ఆయా దేశాలకు వెళ్లిపోవాలని డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే స్పష్టంచేశారు. ఆ దిశగా అధికార యంత్రాంగం చర్యలను ముమ్మరం చేసింది. అక్రమ వలసదారులను ఉపేక్షించడంలేదు. సరైన పత్రాలు లేనివారిని లేదా అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపేందుకు వాణిజ్య, సైనిక విమానాలను వినియోగిస్తోంది. అమెరికాలో భారత్‌కు చెందిన అక్రమ వలసదారులు 7.25లక్షల మంది ఉన్నట్లు అంచనా. 7.25లక్షల మంది భారతీయుల్లో ఎక్కువమంది వీసా గడువు పూర్తయినా అమెరికాలో ఉంటున్నవారే కావడం గమనార్హం. ఎల్‌ పాసో, టెక్సాస్‌, శాన్‌ డియాగో, కాలిఫోర్నియాల నుంచి 5వేల మంది అక్రమ వలసదారులను బహిష్కరించి ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగాన్‌ చర్యలు చేపట్టింది. సైనిక విమానాలు ఇప్పటికే గ్వాటెమాల, పెరూ, హోండురాస్‌లకు వలసదారులను తరలించాయి.

స్పందించిన భారత్‌..
సరైన పత్రాలు లేకుండా ఇతర దేశాలకు వలస వెళ్లి స్వదేశానికి రావాలనుకునే భారతీయులను తిరిగి స్వీకరించేందుకు ఎప్పుడూ సిద్ధమేనని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ గత నెలలోనే స్పష్టం చేశారు. అమెరికా నుంచి భారత్‌కు తిరిగి పంపనున్న అక్రమ వలసదారులు ఎంతమంది ఉన్నారనేది ఇంకా ఖరారు కాలేదన్నారు. తాము ఎప్పుడూ చట్టబద్ధమైన వలసలకే మద్దతు పలుకుతామని చెప్పారు. భారతీయుల ప్రతిభాపాటవాలకు ప్రపంచస్థాయి గుర్తింపు, అవకాశాలు లభించాలని కోరుకుంటున్నామని, అక్రమ వలసల్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నామని ఆయన ఇటీవల వాషింగ్టన్‌లో వ్యాఖ్యానించారు. తమ దేశ పౌరులెవరైనా అక్రమంగా వలస వెళ్లినట్లు గుర్తిస్తే, వారు నిజంగా భారత పౌరులైతే వారిని న్యాయబద్ధంగా తిరిగి స్వీకరించడానికి తామ ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని అమెరికాతో సహా అన్ని దేశాలకూ స్పష్టం చేసినట్లు చెప్పారు.

ఏ దేశాలైనా ధిక్కరిస్తే?
ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయాన్ని ఏ దేశాలైనా ఎదిరిస్తే ఆంక్షలు తప్పవు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ గత వారం మాట్లాడారు. సరైన పత్రాలు లేని వలసదారుల్ని బహిష్కరించేందుకు ట్రంప్‌ ఇచ్చిన ఆదేశాలను ధిక్కరిస్తే అమెరికా కాంగ్రెస్‌ ఆంక్షలు విధిస్తుందని హెచ్చరించారు. ఇందులో భాగంగా వలసదారులను అనుమతించబోమని కొలంబియా తేల్చి చెప్పడంపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశ ఉత్పత్తులపై దాదాపు 25శాతం వరకు సుంకం విధించి ప్రతీకార చర్యలకు దిగింది. దీంతో కొలంబియా దిగిరాక తప్పలేదు. కొలంబియా వెనక్కి తగ్గి తమ పౌరులను ఆహ్వానించడంతో తిరిగి ఆంక్షలను ఎత్తివేసింది. అయితే మొదటి నుంచి మెక్సికో, కెనడా దేశాలను సైతం సుంకాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భయపెట్టారు. కానీ తాజాగా ఈ దేశాలకు కాస్త ఉపశమనం కల్పించారు. ఇరుదేశాల అధినేతలు అమెరికా సరిహద్దుల వెంట భద్రతను కట్టుదిట్టం చేస్తాయని హామీఇవ్వడంతో టారిఫ్‌ల అమలును నెలరోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేశారు.