Sonakshi Sinha: సుధీర్ బాబు సినిమాలో సోనాక్షీ సిన్హా.. గట్టి ప్లానే వేశాడుగా

Sonakshi Sinha: టాలీవుడ్.. ఒకప్పుడు ఈ పేరు వినగానే బాలీవుడ్ చాలా తక్కువగా చూసేది. కానీ, ఇప్పుడు రోజులు మారాయి. ప్రపంచం మొత్తం తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్.. టాలీవుడ్ ఎంట్రీ కోసం తహతహలాడుతున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా SSMB29తో టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. ఇక ఇప్పుడు మరో బ్యూటీ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఆ బ్యూటీ ఎవరో కాదు సోనాక్షీ సిన్హా.
బాలీవుడ్ నటుడు శత్రుఘ్ను సిన్హా నట వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. వరుస అవకాశాలను అందుకొని స్టార్ హీరోయిన్ లిస్ట్ లో చేరింది. ఇక గతేడాది జహీర్ ఇక్బల్ ను వివాహమాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తరువాత కూడా మంచి ఛాన్స్ లను అందుకుంటున్న సోనాక్షీ మొదటిసారి తెలుగులోకి అడుగుపెడుతుంది.
మహేష్ బాబు బావ, హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం జటాధర. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ మరియు సుధీర్ బాబు ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక నేడు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు.
జటాధర సినిమాలో సుధీర్ సరసన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ నటిస్తున్నట్లు మేకర్స్ తెలుపుతూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సోనాక్షీ శాస్త్రీయ దుస్తులు ధరించి కళ్లుమాత్రమే కనిపించేలా చేతులు అడ్డుపెట్టి సీరియస్ గా చూస్తూ ఉంది. లుక్ ను బట్టి చంద్రముఖిలా కనిపిస్తుంది. సూపర్ నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. గత కొన్నేళ్లుగా సుధీర్ బాబు మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. మంచి మంచి కథలతో వస్తున్నా కూడా సుధీర్ బాబును విజయం పలకరించడం లేదు. దీంతో ఈసారి ఎలాగైనా ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. దానికోసమే బాలీవుడ్ బ్యూటీని దింపాడు. మరి ఈ సినిమాతో సుధీర్ కు, సోనాక్షీకి ఎలాంటి హిట్ అందుతుందో చూడాలి.