Sai Pallavi: నేషనల్ అవార్డు తీసుకోవాలని ఉంది : సాయి పల్లవి
![Sai Pallavi: నేషనల్ అవార్డు తీసుకోవాలని ఉంది : సాయి పల్లవి](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/sai-pallavi-1.jpg)
Sai Pallavi about National Award: నేషనల్ అవార్డు కోసం ఎదురుచూస్తున్నానంటుంది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఇటీవల ‘తండేల్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది ఈ భామ. ‘భానుమతి’ నుంచి ‘సత్య’ వరకు తన సహజమైన నటనతో పాత్రలకు ప్రాణం పోసింది. తనదైన నటనతో తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. లేడీ పవర్ స్టార్‌గా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ జాతీయ అవార్డు తీసుకోవాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టింది.
తాజాగా ఇంటర్య్వూలో సాయి పల్లవి మాట్లాడుతూ “నాకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా మామ్మ ఓ చీర గిఫ్ట్‌గా ఇచ్చింది. అది ఇస్తూ నా పెళ్లికి ఈ చీర కట్టుకోమని చెప్పింది. అప్పటికి ఇంకా నేను సినిమాల్లోకి రాలేదు. కాబట్టి పెళ్లి చేసుకున్నప్పుడు దానికి కట్టుకుందామనుకున్నా. మూడేళ్ల తర్వాత సినిమాల్లోకి వచ్చా. నా ఫస్ట్ చిత్రం ప్రేమమ్‌తో ఇండస్ట్రీకి వచ్చా. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఏదోక రోజు ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంటానని నమ్మాను. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో జాతీయ అవార్డు తీసుకోవడం అంటే చాలా గొప్ప.
కాబట్టి నేషనల్ అవార్డు అందుకున్న రోజు మా మామ్మ ఇచ్చిన చీర కట్టుకుని ప్రదానోత్సవం కార్యక్రమానికి హాజరవ్వాలని కోరిక. అందుకే జాతీయ అవార్డు కోసం ఆశగా ఎదురుచూస్తున్నా.అవార్డు తీసుకున్న తీసుకోకపోయినా.. ఈ చీర ధరించే వరకు నాపై ఒత్తిడి మాత్రం ఉంటూనే ఉంటుంది” అని చెప్పుకొచ్చారు. కాగా ఆమె నటించిన గార్గి సినిమాకు గానూ సాయి పల్లవి జాతీయ అవార్డు అందుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ చివరకు నిరాశే ఎదురైంది. ఆ ఏడాది సాయి పల్లవిని కాకుండా నిత్యామేనన్‌ను నేషనల్ అవార్డు వరించింది. దీంతో ఆమె అభిమానులంతా నిరాశపడ్డారు.