Maniratnam Apologizes: అభిమానులకు మణిరత్నం క్షమాపణలు..

Maniratnam Apologizes to audience on Thug Life Movie Failure: ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం, స్టార్ నటుడు కమల్ హాసన్ కాంబోలో రీసెంట్ గా రిలీజైన మూవీ థగ్ లైఫ్. దాదాపు 37 ఏళ్ల తర్వాతా వీరిద్దరి కలయికలో తెరకెక్కింది ఈ మూవీ. భారీ అంచనాలతో జూన్ 5న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను నిరాశ పరిచింది. మొదటి వారం నుంచి డిజాస్టర్ టాక్ వచ్చింది. ట్రైలర్లు, టీజర్లు మూవీపై ఎన్నో అంచనాలు పెంచినా.. చివరకు ఎదురుదెబ్బ తగిలింది. మూవీలో అసలు కథనం, స్క్రీన్ ప్లే బలహీనంగా ఉండటంతో ప్రేక్షకులు తీవ్రంగా నిరాశ చెందారు. థియేటర్లు ఖాళీగా ఉండటం, కర్ణాటకలో మూవీ విడుదల కాకపోవడం వంటి కారణాలు మూవీపై భారీగా ప్రభావం చూపాయి.
దీంతో రూ. 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. పూర్తి థియేట్రికల్ రన్ లో కనీసం సగం కూడా వసూలు చేయలేక చతికిల పడింది. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కలిపి రూ. 150 కోట్లకు పైగా నష్టాలు వచ్చాయని అంచనా వేస్తున్నారు. దీనిపై డైరెక్టర్ మణిరత్నం స్పందించారు. సినిమాపై ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “ప్రేక్షకులు మా నుంచి మరో క్లాసిక్ చిత్రాన్ని ఆశించారు. కానీ ఆ స్థాయిలో సినిమా లేకపోవడంపై వారికి క్షమాపణలు చెబుతున్నా. మేమెప్పుడూ నాయకుడు కంటే తక్కువ స్థాయి సినిమా చేయాలని అనుకోలేదు. అలాంటి ఉద్దేశం లేదు. ఎవరైనా ఆ సినిమా కంటే తక్కువ సినిమా చేయాలని అనుకుంటారా? మేము థగ్ లైఫ్ పై చాలా అంచనాలు పెట్టుకున్నాం. కానీ, మేం అదించిన దానికంటే భిన్నమైన, ఇంకా గొప్ప కథను మీరు మా నుంచి ఆశించారని నాకు అర్థమైంది. తప్పకుండా అలాంటి మంచి కథతో మీ ముందుకు వస్తాను” అంటూ మణిరత్నం వివరించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.