Telangana Inter Exams: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు.. నిమిషం నిబంధనకు బ్రేక్!

Inter Exams Start in Telangana from Today: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు ఫస్ట్, సెకండియర్ కలిపి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో అబ్బాయిలు 4, 97,528 మంది ఉండగా.. అమ్మాయిలు 4,99,443 ఉన్నారు. ఈ మేరకు మొత్తం 1,532 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందు కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది. అయితే ఈసారి పరీక్షా కేంద్రాల గుర్తింపు కోసం హాల్ టిక్కెట్లపై క్యూర్ కోడ్లను సైతం ముద్రించడం విశేషం. ఇందులో ప్రధానంగా పేపర్ లీకేజీ, మాస్ కాపీయింగ్ వంటి సమస్యలు గుర్తించవచ్చు అంతే కాకుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీసీ కెమెరా సర్వైలెన్స్, పెద్ద సంఖ్యలో స్క్వాడ్ లను సైతం ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య వివరించారు.
నేటి నుంచి ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. సెకండియర్ పరీక్షలు రేపటి నుంచి మొదలవనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుండగా.. ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమనే నిబంధనను ఇంటర్ బోర్డు ఎత్తివేసింది. దీంతో విద్యార్థులకు కొంత ఉపశమనం కలగనుంది. ఇందులో భాగంగానే ఇంటర్మీడియట్ పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు లోపలికి అనుమతి ఇవ్వనున్నారు అంటే దాదాపు ఉదయం 9.05 గంటల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లవచ్చు. అయితే పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకుంటే ఒత్తిడి, ఆందోళనకు గురయ్యే అవకాశాలు తగ్గుతాయని విద్యార్థులకు సూచించింది. ఇక నిబంధనల ప్రకారం.. ఉదయం 8.45 గంటల నుంచి 9 గంటల సమయంలో విద్యార్థులకు ఓఎంఆర్ పత్రాన్ని అందజేయగా. . ఈ సమయంలో విద్యార్థులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈఏడాది ఇంటర్ హాల్ టికెట్లపై కూడా క్యూఆర్ కోడ్ ముద్రించడం విశేషం. ఈ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే పరీక్షా కేంద్రం లొకేషన్ కూడా తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే ప్రశ్నపత్రంపై సీరియల్ నంబరు ముద్రించడంతో ఏ నెంబర్ ఉన్న పేపర్.. ఏ విద్యార్థికి వెళ్తుందో కూడా సులువుగా తెలుస్తుంది. ఒకవేళ అది బయటకు వచ్చినా వెంటనే ఏ పరీక్షా కేంద్రం, ఏ విద్యార్థిదనే విషయాన్ని సులభంగా గుర్తించవచ్చు.
ఈ పరీక్షల వేళ.. స్మార్ట్ వాచ్లతోపాటు ఇతర వాచ్‌లను సైతం అనుమతించడం లేదని అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఇంటర్ బోర్డు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను ఈ కేంద్రంతో అనుసంధానించారు. ఈ పరీక్షా కేంద్రాలను మొత్తం 75 మంది సిబ్బంది పర్యవేక్షించనున్నారు. విద్యార్థుల పరీక్షలకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే హెల్ప్ లైన్ నెంబరు 92402 05555 ను సంప్రదించాలని బోర్డు స్పష్టం చేసింది.