PM Modi: ముగిసిన ప్రధాని మోదీ ఏపీ పర్యటన.. నాయకులపై ప్రశంసల వర్షం

Prime Minister Narendra Modi AP Tour: ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ముగిసింది. ఈ మేరకు విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర నిర్వహణ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్, ఎంపీ భరత్‌తో మాట్లాడారు. ప్రపంచం ఏపీ వైపు చూసేలా చేశారని కితాబిచ్చారు. ఏపీ నాయకులు పనితీరు భేష్ అంటూ మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం విశాఖ నుంచి ఢిల్లీ పయనమయ్యారు. ఆయన ఐఎన్ఎస్ డేగా నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు.
కాగా, అంతకుముందు ప్రధాని యోగాంధ్రలో పాల్గొని ప్రసంగించారు. యోగా ప్రజల కోసమేనని వెల్లడించారు. విశాఖలో 11వ ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహించడం గొప్ప అనుభూతి అన్నారు. యోగా మనిషిని నా నుంచి మనం అనే విధానం వైపు నడిపిస్తుందని వ్యాఖ్యానించారు.
175 దేశాలు యోగా దినోత్సవం నిర్వహించడం సాధారణ విషయం కాదని, ఇది శాంతికి మార్గాన్ని చూపుతుందన్నారు. హ్యుమానిటీ 2.0కి ఈ యోగా దినోత్సవం నాంది కావాలని, అంతర్గత శాంతి ప్రపంచ విధానంగా మారాలన్నారు. యోగాతో క్రమశిక్షణ అలవడుతుందని మోదీ పేర్కొన్నారు.