Vangaveeti Ranga: ఉద్రిక్తతలకు దారితీసిన వంగవీటి రంగా విగ్రహం ఏర్పాటు
Vangaveeti Ranga: అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదికరలో వంగవీటి మోహనరంగా విగ్రహం ఏర్పాటు నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు సద్దుమణిగాయి. వివాదం తలెత్తగానే ఘటనా స్థలానికి రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఆర్డీవో కొత్త మాధవి , డీఎస్పీ సుంకర మురళీమోహన్ చేరుకున్నారు. ఇరువర్గాలతో చర్చలు జరిపారు. వివాదాన్ని శాంతియుత వాతావరణంలో పరిష్కరించారు.
వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని అంతర్వేదికర .. కొత్తపేటలో రంగా అభిమానులు పంచాయతీ అనుమతితో ఏర్పాటు చేశారు. అక్కడ రంగా విగ్రహం పెట్టడం కుదరదని మరో సామాజికవర్గం వ్యతిరేకించింది. పోలీసులు వచ్చి పెట్టిన విగ్రహాన్ని బలవంతంగా తొలగించడంతో వివాదం రేగి ఉద్రిక్తతకు దారితీసింది. తిరిగి రంగా అభిమానులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పోలీసులకు, వారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తోపులాటలో రంగా విగ్రహం ఒక చేయి విరిగిపోయింది.
అంబేద్కర్ విగ్రహం ఉన్న సమీప ప్రాంతంలో రంగా విగ్రహం పెట్టవద్దని మరోవర్గం పట్టుపట్టడంతో వివాదం మొదలైంది. మొత్తానికి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, డీఎస్పీ మురళీ మోహన్, ఆర్డీవో మాధవి ఇరువర్గాలతో జరిపిన చర్చలతో వివాదానికి తెరపడింది. విగ్రహం స్వల్పంగా ధ్వంసం కావడంతో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు.