Last Updated:

Baba Amte: మరణం లేని మహానీయుడు.. బాబా ఆమ్టే

Baba Amte: మరణం లేని మహానీయుడు.. బాబా ఆమ్టే

Baba Amte Death Anniversary 2025: స్వతంత్ర భారత దేశ చరిత్రలో సామాజిక సేవారంగంలో స్మరించుకోదగిన ప్రముఖుల్లో బాబా ఆమ్టే ఒకరు. కుష్టురోగం బారిన పడి సమాజం, కుటుంబపు నిరాదరణకు లోనై ఉన్న ఊరుకి, అయిన వారికి దూరంగా అనాథల్లా జీవించే వారికోసం తన జీవితాన్ని అంకితం చేసిన సంఘసేవకుడిగా జాతి చరిత్రలో బాబా ఆమ్టే నిలిచిపోయారు. మహారాష్ట్రలోని వార్ధా జిల్లా హింగన్‌ఘాట్‌లో 1914, డిసెంబరు 6న ఓ సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో బాబా ఆమ్టే జన్మించారు. పూర్తి పేరు.. మురళీధర్‌ దేవదాస్‌ ఆమ్టే. ఆయన తండ్రి ఆగర్భ శ్రీమంతుడు కావడంతో బాల్యం నుంచే దేనికీ లోటు లేని రీతిలో జీవితం సాగింది. యువకుడిగా ఉండగా అత్యంత విలాసవంతమైన జీవితాన్ని ఆమ్టే అనుభవించారు. ఇరవై ఏళ్లకే న్యాయవాద విద్యను అభ్యసించి, సొంతంగా ఒక యువజన సంఘాన్ని నెలకొల్పి యువతను స్వాతంత్ర్య పోరాటం దిశగా నడిపించటం మొదలుపెట్టారు. అదేసమయంలో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అరెస్టయిన అనేక మంది జాతీయ నేతల తరఫున వకాల్తా పుచ్చుకుని వారిని జైళ్ల నుంచి విడిపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొంత కాలం గాంధీజీ సేవాగ్రామ్ ఆశ్రమంలో గడిపారు. ఆ సమయంలో మహాత్మా గాంధీ ఆదర్శాలకు ప్రభావితుడై, విలాసవంతమైన జీవన శైలిని వదులుకుని, జీవితాంతం నిరాడంబరంగా జీవించారు. వేషధారణలో కూడా గాంధీజీ వలె ఖద్దరు దుస్తులనే ధరించి, బాపూజీ మార్గంలోనే పయనిస్తూ.. అణగారిన వర్గాల కృషికై పాటుపడ్డారు. దేశంలో పాతుకుపోయిన అన్యాయాలు, అసమానతలపై పోరాటం సాగించారు. నేడు ఆ మహనీయుని వర్థంతి.

గాంధీజీ ప్రభావానికి బాబా లోనయ్యే రోజుల్లో జరిగిన ఓ సంఘటన బాబా ఆమ్టే జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ఒకరోజు ఆయన రోడ్డుపై వెళుతుండగా, కుష్టువ్యాధితో బాధపడుతోన్న ఓ వ్యక్తిని చూశారు. అయితే అతను కుళ్లిన చర్మంతో ఉండడం చూసి తొలుత భయపడినా.. ఆ తర్వాత దీర్ఘ ఆలోచన చేశాడు. దేశంలో లక్షలమంది ఇలాంటి దుస్థితిలో మగ్గిపోతున్న విషయాన్ని తెలుసుకుని, వారి దుస్థితికి చింతించారు. ఆనక, వారి కోసం ప్రత్యేకంగా ఓ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ఆలోచనలతో పుట్టుకొచ్చిందే ఆనంద్‌వన్. బాబా ఆమ్టే స్థాపించిన మూడు ఆశ్రమాల్లో ఇది మొదటిది. చంద్రాపుర్ జిల్లా వరోరా వద్ద 1951లో ఇది ప్రారంభమైంది. అటవీ ప్రాంతంలో 50 ఎకరాల విస్తీర్ణంలో బాబా నాడు దీనిని ప్రారంభించారు. కుష్టురోగం కారణంగా సమాజం, కుటుంబం నుంచి వెలివేయబడిన వేలాది మందికి అక్కడ ఆశ్రయం కల్పించి వారికి చికిత్సను అందించటం మొదలు పెట్టారు. రోగులతో బాటు తానూ అక్కడే నివాసముంటూ కుష్టువ్యాధిపై జనంలో ఉన్న భయాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. కుష్టు అంటు రోగమని, వారిని తాకినా ఆ వ్యాధి సోకుతుందనే ప్రచారం బలంగా ఉన్న ఆ సమయంలో బాబా ఆ వదంతులకు చెక్ పెట్టేందుకు.. స్వయంగా ఒక కుష్టురోగి నుంచి బాసిల్లో క్రిములను తన శరీరంలో ఇంజెక్షన్ ద్వారా ఎక్కించుకున్నారు. నాడు బాబా ప్రారంభించిన ఆ ఆశ్రమం నేడు 500 ఎకరాలకు విస్తరించింది. అయితే ప్రస్తుతం ఆనంద్‌వన్ ఆధ్వర్యంలో 2 ఆస్పత్రులు, ఒక యూనివర్సిటీ, అంధుల కోసం ప్రత్యేకంగా పాఠశాల, అనాథ ఆశ్రమం కొనసాగుతున్నాయి. ఇందులో నేటికీ 5 వేల మంది ఆశ్రయం పొందుతున్నారు. నానాటికీ అక్కడికి కుష్టురోగులు రావటం ఎక్కువ కావటంతో వారి కోసం సోమనాథ్, అశోకవన్ అనే మరో రెండు ఆశ్రమాలనూ బాబా స్థాపించారు.

సామాజిక న్యాయంతో స్థిరంగా కొనసాగే సమాజాన్ని స్వప్నించిన ఈ దార్శనికుడికి ప్రకృతి పైన, సమానత్వం పైన ఎనలేని విశ్వాసం. అందుకే తన ఆశ్రమాల్లో కుష్టురోగులతో బాటు వికలాంగులకూ స్థానం కల్పించారు. చికిత్స నుంచి కోలుకున్న తర్వాత సాధారణ జీవితం గడిపేందుకు వారికి స్వయం ఉపాధి శిక్షణనూ అక్కడ ఏర్పాటు చేశారు. ‘ఆకాశమంత ఎత్తుకు ఎదిగి ఉదాత్తతను వర్షించే వారే యువజనులు’అంటూ చెప్పిన బాబా.. యువత సమాజసేవ దిశగా అడుగులు వేయాలని సూచించారు. తన ఆశ్రమాల్లో రోగులతో గడుపుతూ పూర్తి శాకాహార భోజనం చేస్తూ జీవనం గడిపినాడు. గాంధీజీ వలెనే స్వయంసమృద్ధి గ్రామాలు ఉండాలని ఆకాంక్షించారు. అలాగే, గాంధీజీ బ్రిటీష్ వారిపై అహింసా పోరాటం జరిపినట్లే బాబా ఆమ్టే కూడా నర్మదా బచావో ఉద్యమంలో కూడా ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా అహింసాయుత పోరాటం కొనసాగించారు. గతంలో పంజాబ్‌లో హింసాత్మక సంఘటనలు జరిగినప్పుడు, ముంబైలో, భాగల్పూర్‌లో అల్లర్లు చెలరేగినప్పుడు ఆయన ప్రజల మధ్యే ఉన్నారు. బాధితుల తరఫున పోరాటం సాగించారు. భారత్‌ జోడో అంటూ ఆయన ఇచ్చిన పిలుపు లక్షలాది హృదయాలను కదిలించింది. బాబా సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనను 1971లో పద్మశ్రీ పురస్కారంతోనూ, 1986లో పద్మ విభూషణ్ అవార్డుతో గౌరవించింది. కుష్టురోగులకు ఆయన తన జీవితాన్ని అంకితం చేసినందుకు గానూ, 1983లో డేమియన్ డట్టన్ లెప్రసీ సంస్థ అవార్డుతో సత్కరించింది. ఇది కుష్టు రోగుల సేవకు పూనుకున్న వారికి అందించే అత్యత్తమ అవార్డుగా గుర్తించబడింది. 1985లో బాబాను రామన్ మెగసెసే అవార్డు సైతం వరించింది. 1999లో గాంధీ శాంతి బహుమతినీ బాబా అందుకున్నారు. జీవితం చివరి నిమిషం వరకు అభాగ్యుల సేవలో తరించిన ఆ మహనీయుడు 2008, ఫిబ్రవరి 9న తాను స్థాపించిన ఆనంద వన్ ఆశ్రమంలోనే కన్నుమూశారు. బాబా సతీమణి సాధనా ఆమ్టే సైతం ఆయన బాటలోనే పయనించి సహధర్మచారిణి అనిపించుకున్నారు.

బాబా ఆమ్టే ప్రారంభించిన సేవలను ఆయన కుమారుడైన ప్రకాష్ ఆమ్టే అదే రీతిలో కొనసాగిస్తూ.. తండ్రికి తగిన తనయుడిగా జీవిస్తున్నారు. వృత్తి రీత్యా వైద్యుడైన ప్రకాష్ ఆనందవన్ ఆశ్రమంలోనే పెరిగారు. కొన్నాళ్ల పాటు పట్టణంలో వైద్యులుగా పనిచేసిన ప్రకాష్, ఆయన భార్య మందాకిని(ఈమె కూడా వైద్యురాలే).. బాబా ఆమ్టే ప్రారంభించిన లోక్ బిరాదారీ ప్రకల్ప్ అనే సంస్థ కార్యకలాపాలను వారసత్వ సేవగా స్వీకరించారు. ఆ ప్రాంతలో జీవించే మడియా గోండులు అనే ఆదివాసీ తెగ జీవితాలలో వెలుగులు నింపేందుకు ఈ జంట తమ జీవితాన్ని అంకితం చేస్తున్నారు. అక్కడ ఓ వైద్యశాలను ఏర్పాటు చేసి ఏటా 40 వేల మంది గోండులకు వైద్యం చేస్తున్నారు. అలాగే, అడవి జంతువులతో మమేకమై జీవిస్తున్నారు. ఈ దంపతులు అక్కడ మూడున్నర దశాబ్దాల నుంచి అక్కడి గోండుల పిల్లల కోసం వారు పాఠశాలను నిర్వహిస్తుండగా, అందులో చదివిన సుమారు 600 మంది పిల్లలు నేడు రకరకాల వృత్తుల్ల స్థిరపడ్డారు. బాబా ఆమ్టే మార్గంలో పయనిస్తూ ఆయన అడవిబిడ్డలకు చేసిన సేవలకు గుర్తింపుగా.. జీవన సహచరియైన మందాకినితో కలిపి సంయుక్తంగా 2008లో రామన్ మెగసెసే అవార్డు పొందారు.

ఇవి కూడా చదవండి: