Hanumakonda: వివాహేతర సంబంధం పెట్టుకుందని గుండుగీసి.. వివస్త్రను చేసి..!

Hanumakonda: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో.. మహిళను వివస్త్రను చేసి.. గ్రామస్తులు దాడి చేశారు. అంతే కాకుండా శిరోముండనం చేసి.. అమానవీయంగా ప్రవర్తించారు. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాడికాయల గ్రామానికి చెందిన ఓ యువతికి పదేళ్ల క్రితం ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. అతడికి సమీప బంధువైన ఓ వివాహితతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో పది రోజుల క్రితం ఇద్దరు ఎటో వెళ్లిపోయారు. దీంతో అతని భార్య తాటికాయల గ్రామానికి వచ్చి తల్లిదండ్రులకు చెప్పింది. వారిద్దరిని వెతికి తీసుకొచ్చిన గ్రామస్తులు వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరికీ గుండు గీయించారు. ఆ మహిళను ఓ మంచానికి కట్టేసి వివస్త్రను చేశారు.
ఆ తర్వాత ఇద్దరి ఆచూకీ తెలియడంలేదు. ఇంతకీ ఆ ఇద్దరు ప్రాణాలతో ఉన్నారో, లేదో తెలియని పరిస్థితి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన గ్రామస్తుల వివరాలను సేకరిస్తున్నారు.