Published On:

Pahalgam Case: పహల్గాం ఉగ్రదాడి కేసులో కీలక పురోగతి

Pahalgam Case: పహల్గాం ఉగ్రదాడి కేసులో కీలక పురోగతి

Pahalgam Case: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ కీలక పురోగతి సాధించింది. పహల్గాం దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్థాన్ పౌరులే అని, వారు నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందినవారేనని ఎన్ఐఏ నిర్ధారించింది. ఈ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని తాజాగా అరెస్ట్ చేసినట్టు తెలిపంది. పహల్గామ్‌కు చెందిన పర్వేజ్ అహ్మద్ జోథర్, బషీర్ అహ్మద్ జోథర్ ఉగ్రవాదులకు ఆశ్రయం, ఆహారం, సాయుధ వసతులు కల్పించినట్టు విచారణలో తెలిసింది. హిల్ పార్క్ ప్రాంతంలో దాడికి ముందు ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులకు ఉద్దేశపూర్వకంగా ఆశ్రయం ఇచ్చారని NIA తెలిపింది. అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం సెక్షన్ 19 కింద ఈ ఇద్దరిని అరెస్టు చేశారు.

 

పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్.. పాక్‌తో చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. దీనికి ప్రతిగా పాక్ కూడా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. జమ్మూ కశ్మీర్‌ నుంచి పాకిస్థాన్‌కు పారిపోయి.. అక్కడి నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తోన్న ఇద్దరు ఆస్తులను కోర్టు ఆదేశాలతో పోలీసులు సీజ్ చేశారు.

 

ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. ఈ దాడికి తామే బాధ్యులమని లష్కరే తొయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. దీంతో ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భారత్ భావించింది. దౌత్యపరమైన ఆంక్షలతో పాటు ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత పాకిస్థాన్ సరిహద్దు వెంబడి ఉన్న రాష్ట్రాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. అయితే భారత్ వాటిని తిప్పికొట్టింది. భారత సైన్యం పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లపై దాడులు చేయడంతో పాక్ వెనక్కి తగ్గింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మే 10 జరగడంతో ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.

 

ఇవి కూడా చదవండి: