Plastic Pollution: అణ్వాయుధం లాంటి ప్లాస్టిక్… వాడితే భస్మం అయిపోతారు జాగ్రత్త!

Plastic Pollution: ప్రతీరోజు మనం అణ్వాయుధాన్ని పట్టుకుతిరుగుతున్నం. అణ్వాయుధాలు అమెరికా, రష్యా, భారత్ దగ్గరే లేవు, మన చేతిలోనే ఉన్నాయి. అణ్వాయుధం వేస్తే కొన్ని సంవత్సరాల వరకు అక్కడ మొక్క పుట్టకపోవచ్చు. వేల కిలోమీటర్లలో మనిషి బ్రతక్కపోవచ్చు. కానీ ప్లాస్టిక్ వాడితే మాత్రం, అదికూడా ‘థిన్ ప్లాస్టిక్’, పలుచనైన ప్లాస్టిక్ కవర్ల లాంటివి వాడటం వలన అణ్వాయుధం కంటే కూడా ఎక్కువ నష్టం కలుగుతుంది. ఈ తరానికే కాదు రానున్న ఎన్నో తరాలు నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ప్లాస్టిక్ కాలుష్యం వలన భూమిపై సారవంతమైన నేల ఉండదు, దీంతో ఆహారం కలుషితం అవుతుంది. పుట్టే పిల్లల్లో వ్యాధులు ఉండే అవకాశం ఉంది.
ఏదో పర్యావరణ దినోత్సవం రోజు… బెలున్లు ఎగరేయడం, నీతులు చెప్పడానికి మాత్రమే ప్రజలు, నాయకులు, ప్రభుత్వాలు పరిమితం అవుతున్నాయి. కానీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. అందుకు ప్రజల్లో బద్దకం, ప్రభుత్వాల్లో పట్టించుకోనితనమే ముఖ్య కారణం.
ప్లాస్టిక్ అనేది కాలుష్య రూపంలో శరీరంలోకూడా వ్యాపిస్తుంది. మైక్రో ప్లాస్టిక్ లు మానవశరీరంలో, రక్తం, జరాయువు, మెదడులో కూడా చేరి మనిషి జీవనాన్ని నాషనం చేస్తున్నాయి. ఇప్పుడు ప్లాస్టిక్ ఎన్నిరకాల వినాశనాన్ని చేస్తుందో చూద్దాం.
శ్వాసకోశ సమస్యలు
నేటి పరిస్థితుల్లో గ్రామీణ, పట్టణ వాతావరణం అనే తేడా లేకుండా గాలిలో మైక్రోప్లాస్టిక్‌లు అధికంగా ఉంటున్నాయి. ఈ చిన్న కణాలు ఊపిరితిత్తులలో పేరుకుపోతున్నాయి, దీనివల్ల వాపు, చికాకు, ఉబ్బసం మరియు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయి. అయినా ప్రజల్లో మాత్రం మార్పురావడం లేదు. ఆపై ప్రభుత్వాలు చట్టాలు చేసి చేతులు దులుపుకుంటున్నాయి. ప్రజల్లో అవగాహన కరువవుతున్నాయి.
హృదయ సంబంధ నష్టం
రక్తప్రవాహంలోని మైక్రోప్లాస్టిక్‌లు వాపు మరియు ఆక్సీకరణ ఒత్తిడికి దారితీయవచ్చని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి, ఈ రెండింటి వలన అథెరోస్క్లెరోసిస్ (ధమనుల గట్టిపడటం) కు ప్రమాదం పొంచి ఉంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ మరియు ఇతర హృదయ సంబంధ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
హార్మోన్ అంతరాయం
చాలా మైక్రోప్లాస్టిక్‌లు BPA లేదా థాలేట్‌ల వంటి హానికరమైన రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి హార్మోన్లను అనుకరిస్తాయి మరియు ఎండోక్రైన్ వ్యవస్థను అంతరాయం కలిగిస్తాయి. ఇది పునరుత్పత్తిపై అంటే పిల్లలను కనడంపై, జీవక్రియపై ప్రభావితం చేస్తున్నాయి, ముఖ్యంగా పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు చాలా ప్రమాదం. అయినా ప్రజలు పట్టించుకోవడం లేదు. ఏకంగా డెలివరీకి హాస్పిటల్ కు వెళ్లిన వారు కూడా బయట టీ షాపులో ప్లాస్టిక్ కవర్ లోనే చాయ్ తెచ్చుకుని తాగుతున్నారు. అంతలా ఉంది మన ప్రజల్లో ప్లాస్టిక్ పై అవగాహన.
మెదడు అవరోధాన్ని దాటడం
కొన్ని అధ్యయనాలు నానో-పరిమాణ ప్లాస్టిక్‌లు రక్తం నుంచి మెదడుకు చేరుతాయని తేలింది. ఇవి మెదడు కణజాలాలలో విషపూరితంగా న్యూరోఇన్‌ఫ్లమేషన్, అభిజ్ఞా బలహీనతలు లేదా నాడీ సంబంధిత రోగాలకు దారితీస్తాయని తేలింది.
రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది
మైక్రోప్లాస్టిక్‌ల వలన మనుషులలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు గురి చేస్తుంది మరియు వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇది మాత్రమే కాకుండా వంట చేయడానికి బేకింగ్ చేయడానికి ప్లాస్టిక్ బ్రెష్ లను, ప్లాస్టిక్ గరిటెలను వాడటం చాలా దారుణం. పాత కాలంలో బ్రెష్ లకు బదులు బట్టను స్టీల్ గరిటెకు కట్టి బ్రెష్ లాగా ఉపయోగించేవారు. ఇప్పుడు ప్లాస్టిక్ ను ఆహారం తయారు చేయడంలో భాగం చేయడంతో ఆరోగ్యాలు నాశనమవుతున్నాయి. మనిషి కష్టపడి డబ్బు సంపాదించి భోజనాన్ని కాకుండా… ప్లాస్టిక్ ను తినే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇప్పటినుంచైనా ప్లాస్టిక్ వాడకాన్ని ఎవరికివారు మానివేయండి ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించేందుకు ముందుకునడవండి.