Last Updated:

Israel-Hamas Cease fire: ఇజ్రాయిల్‌పై ఒత్తిడి.. గాజాలో శాంతి రేఖలు..?

Israel-Hamas Cease fire: ఇజ్రాయిల్‌పై ఒత్తిడి.. గాజాలో శాంతి రేఖలు..?

Israel-Hamas Cease fire: ఇజ్రాయిల్‌ అమానవీయ దాడులతో స్మశానంలా మారిన గాజాలో పూర్తి స్థాయిలో కాల్పుల విరమణకు చర్యలు చేపట్టాలని హమాస్‌ డిమాండ్‌ చేసింది. ఈ దిశగా ఇజ్రాయిల్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలని ప్రపంచ దేశాలను కోరింది. కాల్పుల విరమణకు పూర్తి స్థాయిలో కట్టుబడి వున్నామని హమాస్ మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు హమాస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. కాల్పుల విరమణ, ఖైదీల మార్పిడికి వెసులుబాటు కల్పించిన మొదటి దశ కాల్పుల విరమణ ఒప్పందం శనివారంతో ముగుస్తుండడంతో హమాస్‌ ప్రకటన ద్వారా ఇజ్రాయిల్ మీద ఒత్తిడి తీసుకురావాలని భావిస్తోంది. ఇంతకీ.. గాజాలో ఏం జరుగుతోంది? ఇజ్రాయిల్ ఏం చేయబోతోందో ఈ స్టోరీలో చూద్దాం.

గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయిల్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలని హమాస్‌ కోరింది. తాము కాల్పుల విరమణకు పూర్తి స్థాయిలో కట్టుబడి వున్నామని మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు హమాస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. కాల్పుల విరమణ, ఖైదీల మార్పిడికి వెసులుబాటు కల్పించిన మొదటి దశ కాల్పుల విరమణ ఒప్పందం శనివారంతో ముగుస్తుండడంతో అన్ని దశల్లో ఒప్పందంలోని అన్ని క్లాజులను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి తాము సంసిద్ధంగా వున్నామని హమాస్‌ స్పష్టం చేసింది. ఇజ్రాయిల్‌ కూడా పూర్తి స్థాయిలో ఒప్పందాన్ని అమలు చేసేలా ఇజ్రాయిల్‌పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నామని ఆ ప్రకటన పేర్కొంది.

ఇక ఎలాంటి జాప్యం లేదా వెనుకంజ లేకుండా తక్షణమే రెండో దశలోకి ప్రవేశించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. శనివారంతో ఒప్పందం మొదటి దశ ముగియనున్న నేపథ్యంలో రెండో దశపై ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయని ఈజిప్ట్‌ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చర్చల కోసం గురువారమే కైరోకు ఉభయ పక్షాల ప్రతినిధులు చేరుకున్నారు. కాల్పుల ఒప్పందం పొడిగించడానికి అవసరమైన చర్చలు జరిపేందుకు తగిన ప్రాతిపదిక వుందో లేదో తమ ప్రతినిధి బృందం పరిశీలిస్తోందని విదేశాంగ మంత్రి గిడెన్‌ సార్‌ వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయిల్‌ దాడులు ఆగడం లేదు. వెస్ట్‌ బ్యాంక్‌లోని ఉత్తర ప్రాంతంలో గత వారం రోజులుగా దాడులు కొనసాగుతుండడంతో జెనిన్‌ శరణార్ధ శిబిరంలోని తమ ఇళ్ళను వీడి వెళ్ళాలని బాధితులు భావిస్తున్నారు. ఈ శిబిరంలో సాధారణంగా 24వేల మంది ఉండొచ్చు, కానీ ఇజ్రాయిల్‌ బలగాలు కొనసాగిస్తున్న దాడులతో ఇప్పటికే చాలామంది శిబిరాన్ని వీడి వెళ్ళిపోయారు. పదే పదే దాడులు జరుగుతుండడంతో పరిస్థితులు అధ్వాన్నంగా మారుతున్నాయని బాధితులు అంటున్నారు. గత నెల రోజులుగా ఒక కమ్యూనిటీ సెంటర్‌లో వందలాది కుటుంబాలు తల దాచుకుంటున్నాయి.

నూర్‌ షామ్స్‌ శిబిరంలో చాలా ఇండ్లను ఇజ్రాయిల్‌ ఆర్మీ తగలబెట్టిందని సామాజిక హక్కుల కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఈ శిబిరంలో చాలా భవనాల నుంచి దట్టమైన పొగ వెలువడుతోందన్నారు. ఇళ్లను ఇజ్రాయిల్ దళాలు పేల్చివేయడం కానీ కూల్చివేయడం చేస్తున్నారని పాలస్తీనా మీడియా వర్గాలు అంటున్నాయి. గత నెల్లో వెస్ట్‌ బ్యాంక్‌ ఉత్తర ప్రాంతంలో ఇజ్రాయిల్‌ దాడులు ఆరంభించినప్పటి నుండి వేలాదిమంది పాలస్తీనియన్లు ఇళ్లు వీడి వెళ్లిపోయారు.

అక్టోబర్‌ 7, 2023 హమాస్ దాడులను చాలా తక్కువ అంచనా వేసినట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ పేర్కొంది. నాటి ఘటనలో ఇజ్రాయిలీ పౌరులను రక్షించుకోవడంలో విఫలమైనట్లు ఐడీఎఫ్‌ ప్రత్యక్షంగా అంగీకరించింది. ఆనాటి సంఘటనపై ఐడీఎఫ్‌ పూర్తి రిపోర్టును రిలీజ్ చేసింది. విడుదల చేసిన రిపోర్టులో చాలా కీలక విషయాలు తెలిపింది. హమాస్‌ పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా లేదని భావించామని ఐడీఎఫ్ తెలిపింది. ఒక వేళ పరిస్థితులు మారినట్లు కనిపిస్తే అందుకు సిద్ధంగా ఉండడానికి ఐడీఎఫ్‌కు తగినంత సమయం దొరికేదని రిపోర్టులో వివరించింది.

గాజా స్ట్రిప్‌లో జీవన పరిస్థితులను మెరుగుపరచడం ద్వారా యుద్ధం చేయాలనే ఆలోచన నుంచి హమాస్‌ను దారి మళ్లించవచ్చని భావించినట్లు ఐడీఎఫ్ పేర్కొంది. ఇజ్రాయెల్‌ చేపట్టిన ఈ దర్యాప్తు అక్టోబర్‌ 7 నాటి ఘటనకు ముందు, తర్వాత పరిస్థితులపై ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యంగా ఐడీఎఫ్‌ వ్యూహాలు, యుద్ధ సన్నద్ధత, ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన అంశాలను దర్యాప్తు పరిశీలించింది.

హమాస్ దాడి చేసిన ఘటనలో సుమారు 1200 మందికిపైగా ఇజ్రాయెల్‌ వాసులు చనిపోయారు. 250 మందికిపైగా హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్నారు. దీంతో ప్రతీకార దాడులకు దిగిన ఐడీఎఫ్‌ గాజాపై విరుచుకుపడింది. హమాస్‌ అగ్రనేతలతో సహా, మిలిటెంట్లు లక్ష్యంగా గాజా స్ట్రిప్‌లో వైమానిక, భూతల దాడులు చేపట్టింది. దీంతో హమాస్‌ అధినేత యహ్యా సిన్వర్‌తో సహా వేల మంది మిలిటెంట్లు హతమయ్యారు. 48,000 మంది పౌరులు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య విభాగం వెల్లడించింది. ఈ యుద్ధంలో 400 మందికి పైగా ఇజ్రాయెల్‌ సైనికులు మరణించారు.

ఇప్పుడు ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పులు విరమణ ఒప్పందం నడుస్తోంది. ఇజ్రాయిల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా పౌరులను ఇజ్రాయిల్ ప్రభుత్వం రిలీజ్ చేస్తోంది. దీనికి బదులుగా బందీలుగా ఉన్న ఇజ్రాయెల్‌ వాసులను హమాస్ విడుదల చేస్తోంది. ఈ ఒప్పందం పూర్తైన తరువాత ఇజ్రాయిల్ మళ్లీ తమపై దాడులు చేయకూడదని హమాస్ కోరుకుంటోంది.

ఇవి కూడా చదవండి: