Hormonal Health: హార్మోనల్ సమస్యలను ఇలా దాటొచ్చు..
ఈ మధ్య కాలంలో మహిళలు ఎక్కువగా వినిపిస్తున్న సమస్య హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్. వయసు పెరుగుతున్న కొద్దీ, ఇతర అనారోగ్య సమస్యల వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.
Hormonal Health: ఈ మధ్య కాలంలో మహిళలు ఎక్కువగా వినిపిస్తున్న సమస్య హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్. వయసు పెరుగుతున్న కొద్దీ, ఇతర అనారోగ్య సమస్యల వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీని వల్ల నెలసరి సమస్యలే కాకుండా బరువు పెరగడం, జీర్ణసంబంధింత సమస్యలు, థైరాయిడ్, నీరసం లాంటివి ఇబ్బంది పెడతాయి. అయితే ఇవన్నీ అదుపులో ఉండాలంటే హార్మోన్లను అదుపులో పెట్టుకోవాలి. అందుకోసం జీవన శైలిలో మార్పులతో పాటు సరైన ఆహారాన్ని క్రమం తప్పకుండా పాటించాలి.
ప్రోటీన్ అందేలా..(Hormonal Health)
ముఖ్యంగా తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. అల్పాహారం, భోజనాల్లో తగినంత ప్రొటీన్ ను తీసుకోవడం వల్ల హార్మోన్లతో వచ్చే ఒత్తిడి, అధిక బరువు, చిరాకు, గర్భ ధారణ సమస్యలు లాంటివి తగ్గుతాయి. ఆకలిని పెంచే హార్మోన్లని అదుపులో ఉంచి.. నియంత్రించే హార్మోన్లని విడుదల చేసేందుకు ప్రొటీన్లు సహాయపడతాయి. టీనేజ్ పిల్లలు ప్రతి భోజనంలో కనీసం 30గ్రా ప్రొటీన్ ఉండేట్టు చూసుకోవాలి. పప్పులు, గుడ్లు, చికెన్ శరీరానికి ప్రోటీన్ అందేలా సహకరిస్తాయి.
హార్మన్ల పనితీరుపై తియ్యటి పదార్థాలు ప్రభావం చూపుతాయి. అందుకే తీపిని ఏ రూపంలో తీసుకున్నా ప్రమాదమే. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ఈ హార్మోన్ల సమస్య నుంచి ఆరోగ్యకరమైన కొవ్వులు ముఖ్యంగా ఒమెగా త్రీ ఉండే కొవ్వు పదార్థాలు మంచి ఉపశమనం కలిగిస్తాయి. బాదం పప్పులు, పల్లీలు, చేపలు, కొబ్బరి, పాలకూర, మొలకలు లాంటివి ఆరోగ్యకరమైన కొవ్వులని ఎక్కువగా అందిస్తాయి. కాబట్టి రోజు వారి ఆహారంలో అవి ఉండేలా చూసుకోవాలి.
జంక్‌ఫుడ్‌కు దూరంగా(Hormonal Health)
హార్మోన్ల సమస్యల నుంచి రిలీఫ్ పొందేందుకు ఆకుకూరలు, పసుపు, కొబ్బరి, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, బ్రకోలీ, చిలగడ దుంపలు, గుడ్లు లాంటివి ఉపయోగపడతాయి.
టీనేజ్ లో మొటిమలు, నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువ అవ్వడానికి ఈ హార్మోన్ల అసమతుల్యతే కారణం. కాబట్టి ఈ వయసులో జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటూ బరువును అదుపులో ఉంచుకోవాలి.
అదే విధంగా గర్భం దాల్చినప్పుడు హార్మోన్లు హెచ్చు తగ్గులకు లోనవుతాయి. బిడ్డ ఎదుగుదల కోసం ప్రొటీన్లు, క్యాల్షియం ఎక్కువగా అవసరమవుతాయి. పోషకాహారం తీసుకోవటంతో పాటు రోజూ తప్పకుండా వ్యాయామం చేస్తే హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.
7-8 గంటల నిద్ర తప్పనిసరి
రోజూ తీసుకునే ఆహారంతో పాటు రోజుకు 7, 8 గంటల గాఢ నిద్ర చాలా అవసరం. అప్పుడే హార్మోన్ల పనితీరు మెరుగ్గా ఉంటుంది.
హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ ఉన్నపుడు ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉన్న కాఫీని పరగడుపునే తీసుకోవడం వల్ల ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. కాఫీకి బదులుగా ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఫలితంగా రోజంతటికీ కావాల్సిన శక్తి శరీరానికి అందుతుంది.
వీటన్నింటితో పాటు హార్మోన్ల సమతుల్యత కోసం డాక్టర్ సూచించిన మందులు, ఇతర సలహాలు పాటించాలి. తద్వారా మంచి ఫలితాన్ని పొందచ్చు. ఆ సమస్య వల్ల కలిగే అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు.