Naga Chaitanya: శోభితతో జీవితం సంతోషంగా సాగుతుంది: నాగచైతన్య

Actor Naga Chaitanya: నటుడు నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వివాహం తర్వాత కూడా సినిమాలు, సిరీస్‌లు చేస్తూ ఇద్దరూ బిజీగా ఉంటున్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తగత జీవితం గురించి మాట్లాడారు. శోభితతో తన జీవితం సంతోషంగా సాగుతుందని చెప్పుకొచ్చారు. వారం మొత్తం వర్క్‌లైఫ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, వారాంతంలో మాత్రం వ్యక్తిగత జీవితానికే సమయం కేటాయిస్తామని చెప్పారు. ఒక విషయంలో మాత్రం కచ్చితమైన నియమాన్ని పాటిస్తామని తెలిపారు.
వర్క్ లైఫ్ కారణంగా ఇద్దరం కలిసి సమయం కేటాయించటానికి అంతగా వీలుపడదని చెప్పుకొచ్చారు. మంచి సమయాన్ని కేటాయించడానికి, అనుబంధాన్ని పెంచుకోవడం కోసం ఇద్దరం కొన్ని నియమాలు పాటిస్తామని చెప్పారు. ముఖ్యంగా తాము హైదరాబాద్‌లో ఉంటే తప్పకుండా ఉదయం, రాత్రి సమయాల్లో కలిసే భోజనం చేస్తామని చెప్పారు. ఆదివారాల్లో తమకు నచ్చిన విధంగా ఉంటామని తెలిపారు. మూవీ నైట్, షికారుకు వెళ్తామని చెప్పారు. నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, లేక వంట చేసుకోవడం ఇలా ఆ క్షణాలను మధురజ్ఞాపకంగా మార్చుకుంటామని తెలిపారు. తనకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టమన్నారు. తనకు రేసింగ్‌పై ఆసక్తి ఉందన్నారు. ఇద్దరం కలిసి హాలిడే ప్లాన్స్ వేస్తామన్నారు. ఇటీవల తనకు రేస్‌ట్రాక్‌పై డ్రైవింగ్ నేర్పించినట్లు తెలిపారు. తను ఎంతో సంతోషించిందన్నారు. బాగా ఎంజాయ్ చేసిందని నాగచైతన్య చెప్పారు.
తనకు నచ్చిన రియల్ లైఫ్ హీరోల గురించి మాట్లాడారు. రతన్ టాటాను తాను అభిమానిస్తుంటానని చెప్పుకొచ్చారు. నిజ జీవితంలో కొంతమంది వ్యక్తులను హీరోలుగా చూస్తుంటామని, తన కుటుంబం కాకుండా రతన్ టాటా అంటే తనకెంతో గౌరవమన్నారు. ఆయన్ను ఒక స్ఫూర్తి ప్రదాతగా భావిస్తానని స్పష్టం చేశారు. ఎలాన్ మస్క్ జీవిత ప్రయాణం తనను ఆశ్చర్యపరుస్తుంటుందన్నారు. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ అంటే అభిమానమేనని చెప్పుకొచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చేసరికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి అంటే తనకెంతో అభిమానమని తెలిపారు.