Hyderabad Book Fair: 37వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్.. కొత్త ఆశలు నింపిన పుస్తకాల పండుగ
Hyderabad Book Fair 2024: భాగ్యనగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో గత పది రోజులుగా సాగిన 37వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ఆదివారం సాయంత్రంతో ముగిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదగా ఈ నెల 19 సాయంత్రం ప్రారంభమైన ప్రదర్శనకు తొలిరోజు మంత్రులతో పాటు కవులు, సామాజిక వేత్తలు, పౌరసమాజ ప్రతినిధులు, విద్యావేత్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గతానికంటే భిన్నంగా ఈసారి బుక్ ఫెయిర్‌లో 347 స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రభుత్వ పథకాలు, తెలంగాణ సంస్కృతి, పర్యాటకం గురించి తెలిసేలా 171 స్టాళ్లు, ఇంగ్లిష్ పబ్లిషర్స్ 135, స్టేషనరీకి 10 స్టాళ్లు, తమ పుస్తకాలను నేరుగా అమ్ముకోవాలనుకునే రచయితలకు 6 ప్రత్యేక స్టాళ్లు, కేటాయించారు. ఒక సర్కస్‌కో, మ్యాజిక్ షోకో, జాతరకో వచ్చినట్లుగా లక్షలాది పుస్తక ప్రియులు రూ. 10 టికెట్ కొని మరీ తరలిరావటం యువత, మధ్య తరగతిలో పెరిగిన పుస్తక పఠన దాహానికి నిదర్శనంగా నిలిచింది. సాధారణ రోజుల్లో రోజుకు 50 నుంచి 80 వేల మంది, సెలవు దినాల్లో లక్షకు పైగా తరలివచ్చారు. ఈ పదిరోజుల్లో 11 లక్షలకు పైగా పాఠకులు, రూ. 15 కోట్ల విలువైన పుస్తకాలు కొనుగోలు చేశారు. హర్యానా, తెలంగాణ గవర్నర్లు కూడా ఈ పుస్తక కుంభమేళాకు హాజరై, ఇకపై అందరూ పుస్తకాలను బహుమతులు ఇవ్వాలనే మంచి సందేశాన్ని ఇచ్చారు. డిజిటల్ మాధ్యమాల మూలంగా పుస్తకానికి ఆదరణ తగ్గిందనే భావన నెలకొన్న తరుణంలో కట్టు తెగినట్లు బుక్‌ఫెయిర్.. సందర్శకులతో కళకళలాడడం చూస్తుంటే పుస్తకానికి మరింత భవిష్యత్తు ఉందనే ఆశ మొలకెత్తుతోంది.
హైదరాబాద్ తొలి బుక్ ఫెయిర్ తొలిసారిగా 1985లో అశోక్‌నగర్‌లోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిర్వహించారు. ఆ తర్వాత నల్లగొండ, హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్, పబ్లిక్ గార్డెన్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ వంటి ప్రాంతాల్లోనూ నిర్వహించినా, గత 12 ఏండ్లుగా రాజధానిలోని ఎన్‌టీఆర్ స్టేడియం.. బుక్ ఫెయిర్‌కు వేదికగా నిలుస్తోంది. తొలి పుస్తక ప్రదర్శనకు హాజరైన విశాలాంధ్ర, ప్రజాశక్తి, మిళింద్ర ప్రకాశన్, ఎమ్మెస్కో, నవోదయ వంటి సంస్థలు నేటి వరకూ ఈ బుక్ ఫెయిర్‌లో పాలుపంచుకోవటం విశేషం. పదిరోజుల పాటు పుస్తక ప్రదర్శన పండుగలా సాగడానికి, దీని పట్ల ప్రజానీకానికి ఆసక్తి పెరగడానికి బుక్‌ఫెయిర్ నిర్వాహకులు ముందు నుండే బుక్‌ఫెయిర్ సమాచారాన్ని, కార్యక్రమాల వివరాలను పలు మాధ్యమాలలో అందించటం, పుస్తక పఠన ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ పుస్తక ప్రదర్శనను విజయవంతం చేయవలసిన బాధ్యత అందిరిదీ అంటూ సందేశాలు పంపటం ఈ ప్రదర్శన విజయవంతం కావటానికి దోహదపడింది.
ఈసారి బుక్ ఫెయిర్ ప్రాంగణానికి మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల పేరు పెట్టారు. అలాగే, తోపుడుబండి సాదిక్ పేరిట ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి, దానిపై నుంచి రోజుకు పదుల సంఖ్యలో పుస్తకాలను పలువురు కవులు, రచయితలు ఆవిష్కరించారు. అనేకమంది యువ రచయితలు తమ రచనలను ఈ వేదిక నుంచి ప్రకటించారు. ఈసారి కంచె ఐలయ్య రాసిన ‘శూద్ర రెబిలియన్’,సంఘటిత స్త్రీవాద కవిత్వం, ఎర్ర రంగు బురద నవల అనువాద పుస్తకాలతో బాటు దాచేస్తే దాగని సత్యం, జీవ పరిణామం, బాలామణి రచించి, నవతెలంగాణ ప్రచురణగా వచ్చిన ‘స్త్రీ ఆధునిక కళాకారిణిగా శతాబ్ద యానం- సమాజ ప్రతి బింబం, భారతీయ దృశ్య కళా చరిత్ర’ పుస్తకాలూ ఈ వేదిక నుంచి వెలుగుచూశాయి. అలాగే, పాపారావు రాసిన ‘మానవాళికి మహోదయం’పుస్తకాన్ని దేశపతి శ్రీనివాస్ ఆవిష్కరించగా, సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ ఆ పుస్తకాన్ని పరిచయం చేశారు. ధూపాటి ప్రభాకర్ రాసిన ‘వెలుగు వైపుగా’పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రెసిడెంట్ కవి యాకూబ్, జ్ఞానపీఠ పురస్కార స్వీకర్త విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘మ్రోయు తుమ్మెద’5వ ముద్రణను ఆచార్య వెలుదండ నిత్యానందరావు ఆవిష్కరించారు.
ఈసారి బుక్‌ఫెయిర్ మీడియా పాయింట్‌కు ఉప్పల నరసింహం, రచయిత్రుల స్టాళ్లకు గుస్సాడి కళాకారుడు కనకరాజు పేర్లు పెట్టారు. మరోవైపు, జ్యోతిరావుపులే జీవిత చరిత్రను తెలుగులోకి తొలిసారిగా అనువదించిన రచయిత్రి, ప్రసిద్ధ విమర్శకురాలు బోయి విజయభారతి పేరును బుక్‌ఫెయిర్ మరో ప్రధాన వేదికకు పెట్టారు. ఈ వేదికపై ఈ పది రోజుల పాటు రోజూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు, చర్చా వేదికలు నిర్వహించారు. పిల్లలో దాగున్న సృజనాత్మకత, విజ్ఞాన వికాసానికి సంబంధించిన అంశాలను వెలుగుచూసేలా పలు పోటీలు నిర్వహించి, విజేతలతో బాటు అందులో పాల్గొన్న వారికి బహుమతిగా పుస్తకాలను అందజేశారు. ప్రధాన వేదికకు సమీపంలో రంగస్థల నిపుణుడు శాంతారావు ఆధ్వర్యంలో పిల్లలకు డ్రామా వర్క్‌షాప్, స్టోరీ టెల్లింగ్, క్రాఫ్ట్‌వర్క్ శిక్షణ శిబిరాలు, వినూత్న వస్త్రాలంకరణ, బృంద నృత్య, సంగీత ప్రదర్శనలు, చిత్రలేఖనం, కథారచన పోటీలు, రోజూ సాయంత్రం 6గంటల నుంచి వివిధ అంశాలపై సాహిత్య చర్చాగోష్ఠులు, కవితా పఠనాలు పుస్తక ప్రియులను ఆకట్టుకున్నాయి. అలాగే, పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన పెంచేందుకు ప్లాస్టిక్ సంచులకు బదులు రూ. 5 కే బట్టతో కూడిన చేతి సంచీలను నిర్వాహకులు అందుబాటులోకి తీసుకువచ్చి, ఓ మంచి సందేశాన్ని నిర్వాహకులు అందించారు. పుస్తక ప్రదర్శన ప్రాంగణంలో తెలంగాణ రుచులతో ఫుడ్ స్టాళ్లు, వైద్య శిబిరం ఏర్పాటుతో బాటు పుస్తకాలపై కనీసం పది శాతం తగ్గింపును అందించటం విశేషం.
ఈసారి యువత ఎక్కువగా కొనుగోలు చేసిన పుస్తకాలలో దశాబ్దాలుగా చెక్కుచెదరని పాఠకాదరణ కలిగిన గురజాడ కన్యాశుల్కం, గోపీచంద్ అసమర్థుని జీవయాత్ర, బుచ్చిబాబు చివరకుమిగిలేది, శ్రీదేవి కాలాతీత వ్యక్తులు, మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం వంటివాటికి చోటు దక్కింది. అదే సమయంలో భారత రాజ్యాంగంపై వచ్చిన ఆంగ్ల, తెలుగు పుస్తకాలకు, తెలుగు చరిత్ర, సంస్కృతి, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల పాలన వంటి పుస్తకాలకు ఆదరణ లభించింది. యువ రచయితలు తెచ్చిన సోషల్ మీడియా స్టైల్ పుస్తకాలకు సైతం ఆదరణ లభించింది. ప్రముఖుల జీవిత చరిత్రలు, ఆధ్యాత్మిక గ్రంథాలనూ పాఠకులు అక్కునజేర్చుకున్నారు. హార్పర్ కాలిన్స్ ఇండియా, సేజ్, పెంగ్విన్, మున్షీరాం మనోహర్‌లాల్, కేంద్ర సాంస్కృతిక అకాడమీ, సీపీ బ్రౌన్ అకాడమీలాంటి జాతీయ ప్రచురణ సంస్థల స్టాళ్లతో బాటు హైదరాబాద్ బుక్‌ట్రస్ట్, వీక్షణం, ఎమెస్కో, నవయుగ, నవ తెలంగాణ, నవచేతన, తెలంగాణ పబ్లికేషన్స్, బాలగోపాల్ రచనలు, విశ్వనాథ సాహిత్య పీఠం, స్కైబాబ ముస్లిం మైనార్టీ ప్రచురణలు, భూమి బుక్ ట్రస్ట్, మంచి పుస్తకం, అన్వీక్షికి, ఛాయా.. ఇలా తెలుగు ప్రచురణ సంస్థల పుస్తకాలను యువత ఆసక్తిగా కొనుగోలుచేయటం కనిపించింది. ఈ జోరు చూశాక ఈ రోజుల్లోనూ అచ్చొత్తిన పుటల పురుళ్ళకు ఇంకా కాలం చెల్లలేదని అర్థమవుతున్నా, నేటికీ కన్నడ, తమిళ, మళయాళ పుస్తకాల అమ్మకాలు, చదువరుల గణాంకాలతో పోల్చితే మనం ఇంకా వెనకబడే ఉన్నామనే మాటా గుర్తుకు వస్తోంది. పొరుగు భాషల రచయితలు తమ పుస్తకాలను వేల కాపీల్లో ముద్రించి ఏడాదిలో పునర్ముద్రణకు వెళుతుంటే మనం మాత్రం వారి దరిదాపుల్లో కూడా లేమనే వాస్తవం.. కాస్త నిరాశను కలిగిస్తున్నా, క్రమం తప్పకుండా ఏటా భాగ్యనగరంలో పుస్తక ప్రదర్శన పేరుతో ఒక మంచి ప్రయత్నం రెట్టించిన ఉత్సాహంతో జరుగుతున్న తీరు సంతోషాన్ని కలిగించింది. పుస్తకం హస్తభూషణమే కాదు, మస్తక వర్ధనమనే వాస్తవాన్ని తెలుగువారిగా మనం అర్థం చేసుకుంటే, మరో నాలుగేళ్లకైనా తెలుగు పుస్తకం వెలుగుబాట పడుతుంది.