ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ54 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శనివారం ఉదయం 11.56 గంటలకు రాకెట్ నింగిలోకి ఎగిరింది. ఈ రాకెట్ ప్రయోగానికి శుక్రవారం ఉదయం 10.26 గంటల నుంచే కౌంట్ డౌన్ మొదలైంది. పీఎస్ఎల్వీ సీ54 ద్వారా కక్ష్యలోకి ఈవోఎస్ 06 (ఓషన్ శాట్ 03) సహా మరో ఎనిమిది ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్ష కక్ష్యలోకి పంపించింది.
అయితే ఈవోఎస్ సిరీస్‌లో ఇది ఆరో ఉపగ్రహం కాగా పీఎస్ఎల్వీ సిరీస్‌లో 56వ రాకెట్ ప్రయోగం. ఈవోఎస్ 06 ఉపగ్రహం భూపరిశోధనలు, సముద్ర గర్భంలో అధ్యయనంకోసం ఉపయోగపడుతుంది. ఈ రాకెట్ ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన తైబోల్ట్–1, తైబోల్ట్–2, ఆనంద్, ఇండియా–భూటాన్ దేశాలు సంయుక్తంగా తయారు చేసిన అకా ఐఎన్‌ఎస్–2బీ, స్విట్జర్లాండ్‌కు చెందిన ఆస్ట్రోకాస్ట్ –2 పేరుతో నాలుగు శాటిలైట్లను ఇస్రో స్పేస్ లోకి ప్రయోగించింది. ఇస్రో అంతరిక్ష కక్ష్యలోకి పంపించే ఎనిమిది ఉపగ్రహాల్లో హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ధ్రువస్పేస్ రూపొందించిన థైబోల్ట్ 1, థైబోల్ట్ 2 ఉపగ్రహాలుకూడా ఉన్నాయి. ఈ ఉపగ్రహాలు రేడియో కార్యకలాపాలకు సంబంధించిన పేలోడ్లను కక్ష్యలోకి తీసుకెళ్లనున్నాయి. దాదాపు 20 ఎంఎస్ఎంఈల సహాయంతో ఈ ఉపగ్రహాలను పూర్తిగా హైదరాబాద్‌లోనే నిర్మించామని ధ్రువ స్పేస్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు సంజయ్ నెక్కంటి తెలిపారు.
ఇదీ చదవండి: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు 38 ప్రత్యేక రైళ్లు