BJP MP Raghunandan Rao: ఎంపీ రఘునందన్‌రావు అరెస్టు.. వెలిమల తండాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
BJP MP Raghunandan Rao Arrest: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కేసులు, విచారణలు నడుస్తుండగా, మరోవైపు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు, అరెస్టు ఇలా హాట్‌టాఫిక్‌గా తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం వెలిమల తండాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రఘునందన్‌రావును పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
గిరిజనులకు మద్దతుగా ఆందోళన..
ఎంపీ రఘునందన్‌రావు శుక్రవారం ఉదయం గిరిజనులకు మద్దతుగా ఆందోళన నిర్వహించారు. పోలీసులు పలుమార్లు బుజ్జగించే ప్రయత్నం చేసినా ఆందోళన విరమించలేదు. దీంతో ఎంపీని పోలీసులు అరెస్టు చేశారు. రఘునంనదన్‌ను అరెస్టు చేసే సమయంలో పోలీసులను గిరిజనులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, గిరిజనులకు మధ్య వాగ్వాదం జరిగింది.
పది రోజులుగా..
వెలిమల భూవివాదం పది రోజులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమకు న్యాయం చేయాలంటూ గిరిజనులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో గిరిజనుల ఆందోళన చేపట్టారు. గిరిజనులకు రఘునందన్ మద్దతు తెలిపారు. గిరిజనులకు బీజేపీ అండగా నిలుస్తుందని చెప్పారు.
గిరిజనులతో కలిసి ర్యాలీ..
గిరిజనులతో కలిసి వెలిమల తండా నుంచి సదరు భూముల వద్దకు ర్యాలీగా వెళ్లి రఘునందన్‌రావు ఆందోళన నిర్వహించారు. ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. రఘునందన్‌ను అరెస్టు చేయడంపై గిరిజనులు, బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.