Site icon Prime9

CM Jagan: కేంద్రంతో తమ అనుబంధం రాజకీయాలకు అతీతం.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

cm jagan and pm modi in visakhapatnam

cm jagan and pm modi in visakhapatnam

CM Jagan:  ఏపీ విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సభావేదికపై ప్రియమైన సోదరీ, సోదరులకు నమస్కారం అంటూ ప్రధాని ప్రసంగాన్ని ప్రారంభించారు.

పేదల సంక్షేమమే మా ధ్యేయం- ప్రధాని

ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపించే ప్రేమ ఆప్యాయతలు ఎనలేనివని మోదీ ప్రశంసించారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ తెలుగు ప్రజలు తమ సత్తా చాటుతున్నారని తెలిపారు. కొన్ని నెలలక్రితం తాను విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల కోసం రాష్ట్రానికి వచ్చానని, మరోసారి అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉందన్నారు. భారత్ ఎన్నో అడ్డుగోడలు తొలగించుకుంటూ ప్రపంచ దేశాలకు దీటుగా అభివృద్ధి దిశగా సాగుతోందని తెలిపారు. యావత్ ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని ప్రపంచ గమనానికి భారత్ కేంద్రం అవుతోందన్నారు. మా ప్రతి నిర్ణయం సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడం కోసమేనని ఆయన పేర్కొన్నారు. నేడు ఓ పక్క జీఎస్టీ, గతిశక్తి, ఐబీసీ, జాతీయ మౌలిక సదుపాయాలు, పైపు లైన్ కోసం, మరోవైపు పేదవారి సంక్షేమం కోసం ఎన్నో విధానాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. డ్రోన్ నుంచి గేమింగ్ వరకు, స్పేస్ నుంచి స్టార్టప్ ల వరకు మా విధానాలు నవతరానికి కొత్త అవకాశాలు అందిస్తున్నాయని ప్రధాని వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో నూతన సాంకేతికత ద్వారా సముద్ర లోతుల్లో ఇంధనాన్ని వెలికి తీయడం శుభపరిణామమన్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్, ఫిషింగ్ హార్బర్ లను ఆధునికీకరిస్తున్నారని తద్వారా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు. దేశంలో నీలి విప్లవం ద్వారా విశేష మార్పులు తీసుకువచ్చామన్నారు.

రాజకీయాలకు అతీతంగా కేంద్రంతో అనుబంధం- సీఎం జగన్
ఇకపోతే ఇదీ సభపై ప్రసంగించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం పార్టీలు రాజకీయాలకు అతీతమని పేర్కొన్నారు. మాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో అజెండా లేదని ఉండబోదని ఆయన తెలిపారు. మా రాష్ట్రానికి మా ప్రజలకు గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాన్ని గుర్తుంచుకున్న ప్రజలు పెద్ద మనస్సుతో మీరు చూపే ప్రేమను అభిమానాన్ని గుర్తుపెట్టుకుంటారని జగన్ తెలిపారు. గడిచిన మూడున్నరేళ్లల్లో విద్య, వైద్య, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళా సంక్షేమం, పారదర్శకత, గడప వద్దకే పరిపాలనే తమ ప్రాధాన్యతలుగా అడుగులు వేసినట్లు జగన్ మోదీకి వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, శ్రేయస్సు కోసం విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ వంటి అంశాలపై చేసిన విజ్ఞప్తులను పరిష్కరించాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహాయసహకారాలు అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తదితరశాఖల మంత్రులు అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఏపీకి మంచి రోజులు వస్తాయి.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Exit mobile version