Immigration in Britain: బ్రిటన్ ప్రజలు వలసలు.. కారణాలేంటి?
Reasons for Immigration in Britain: బ్రిటన్ ప్రజలు వలసలు వెళుతున్నారు. ప్రధానంగా సర్కార్ ఎడా ఎడా విధిస్తున్న పన్నులను బ్రిటన్ జనం తట్టుకోలేకపోతున్నారు. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో పన్నుల గోల లేని మధ్య ప్రాచ్యంలోని ఇస్లామిక్ దేశాల కు వెళ్లడానికి బ్రిటన్ పౌరులు ఆసక్తి చూపుతున్నారు.
బ్రిటన్ చాలా కాలం నుంచి వలసలతో సమస్య ఎదుర్కొంటోంది. అనేకసార్లు ఇదే విషయమై బ్రిటన్లోని అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పార్లమెంటులో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. అయితే పరిస్థితి ఏ రోజూ చేయిదాటలేదు. కాగా వలసల అంశం బ్రిటన్ వరకు నివురుగప్పిన నిప్పులానే ఉంది. అయితే తాజాగా యునైటెడ్ కింగ్ డమ్ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. ఎక్కువ మంది మధ్య ప్రాచ్యంలోని ముస్లిం దేశాలకు వలస వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు . నిన్న మొన్నటివరకు వలసలతో ఇబ్బందులు పడ్డ బ్రిటన్ నుంచి ఇతర దేశాలకు వలసలు ప్రారంభం కావడం అందరినీ నివ్వెర పరుస్తోంది.బ్రిటన్ వరకు దీనిని రివర్స్ ట్రెండ్ గా చెప్పుకోవచ్చు.
బ్రిటన్ నుంచి వలసలు ప్రారంభం కావడానికి ఒకటి కాదు.. అనేక కారణాలున్నాయి. బ్రిటన్ లో ఇటీవలి కాలంలో జీవన వ్యయం విపరీతంగా పెరిగింది. సాధారణ జీవనం గడపడానికి కూడా పెద్ద మొత్తంలో సొమ్ములు ఖర్చువుతున్నాయి. ప్రధానంగా ఇంటి అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాజధానీ నగరమైన లండన్ లో అయితే ఇంటి అద్దెలు సామాన్యులకు ఏమాత్రం అందుబాటులో ఉండవు. కాగా లండన్ కు ఖరీదైన నగరంగా ఇప్పటికే పేరుంది. అనేక దేశాల రాజధానులతో పోలిస్తే, లండన్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా ఎక్కువ.లండన్ లో ఓ చిన్నపాటి ఇల్లు అద్దెకు తీసుకోవడం అంటే సగటు బ్రిటన్ పౌరుడికి తలకు మించిన భారంగా మారింది.
ఇక రెండో కారణం.. విపరీతమైన పన్నులు. బ్రిటన్ లో ఉన్నన్ని భారీ పన్నులు మరే దేశంలోనూ కనిపించవు. ప్రజలను సంతృప్తి పరచడానికి అనేక సంక్షేమ పథకాలను బ్రిటన్ ప్రభుత్వం అమలు చేస్తోంది.ఈ సంక్షేమ పథకాలకు సహజంగా పెద్ద ఎత్తున నిధులు అవసరం అవుతాయి. దీంతో నిధుల సేకరణ కోసం సాధారణ ప్రజలపై బ్రిటన్ ప్రభుత్వం ఎడాపెడా పన్నులు వేస్తోంది. వ్యక్తిగత ఆదాయంపైన పన్నుతోపాటు వాణిజ్య కార్యకలాపాలపై కూడా భారీ ఎత్తున బ్రిటన్ సర్కార్ పన్నులు వేస్తో్ంది. దీంతో ఈ పన్నుల భారాన్ని సగటు బ్రిటన్ పౌరుడు మోయలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో పన్నుల గోల లేని మధ్య ప్రాచ్యంలోని ఇస్లామిక్ దేశాల కు వెళ్లడానికి మెజారిటీ బ్రిటన్ పౌరులు ఆసక్తి చూపుతున్నారు.
బ్రిటన్ లో నేషనల్ హెల్త్ సర్వీస్ అమలులో ఉంది. ఈ హెల్త్ సర్వీస్ కు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు ఉంది. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరేగా ఉన్నాయి. నేషనల్ హెల్త్ సర్వీస్ లో భాగంగా డాక్టర్లను సంప్రదించాలంటే గంటల కొద్దీ క్యూలలో వెయిట్ చేయాల్సిన పరిస్థితులున్నాయి. అంతేకాదు ఏ ఆస్పత్రి చూసినా పేషెంట్లతో కిక్కిరిసే ఉంటున్నాయి. ఏదైనా ఆస్పత్రి లో చేరదామంటే బెడ్లు ఖాళీ లేవన్న మాట వినిపిస్తోంది. రోజుల తరబడి ఆస్పత్రుల యాజమాన్యాలు ఇదే మాట చెబుతుంటాయి. దీంతో మెరుగైన హెల్త్ కేర్ వ్యవస్థ అవసరం అని బ్రిటన్ పౌరులు భావిస్తున్నారు. ఇది కూడా బ్రిటన్ పౌరులు
వలసబాట పట్టడానికి ఒక కారణం అంటున్నారు సామాజిక శాస్త్ర వేత్తలు.
ఇదిలా ఉంటే , బ్రెగ్జిట్ ఒప్పందం తరువాత బ్రిటన్ లో రాజకీయంగా అనేక మార్పులు సంభవించాయి. ప్రధానంగా రాజకీయ సుస్థిరత ప్రమాదంలో పడిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సహజంగా బ్రిటప్ పౌరులు రాజకీయ సుస్థిరత కోరుకుంటారు. ఈ నేపథ్యంలో దేశం విడిచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడానికి బ్రిటన్ పౌరులు ఆసక్తి చూపుతున్నారు.
కాగా బ్రిటన్ యువతకు ప్రస్తుతం ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. అంతేకాదు ఉద్యోగాలు దొరికినా,చాలీ చాలని వేతనాలు. దీంతో యువత తీవ్ర నిరాశా నిస్పృహలకు గురవుతోంది.తమ ప్రతిభకు తగ్గ ఉద్యోగాలు ఇచ్చే ఇతర దేశాలకు వలస వెళ్లడానికి బ్రిటన్ యువత ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ సుస్థిరత, అల్లర్లు, ఆందోళనలు లేకపోవడం, తక్కువ ధరకు మంచి హౌసింగ్ అకామడేషన్ వంటి అంశాలు వలసల్లో కీలకంగా మారాయి.
ప్రపంచదేశాల్లో వలసలకు అనేక కారణాలున్నాయి. ఇటీవల కాలంలో అనేక దేశాల్లో యుద్ధాలు, అంతర్యుద్ధాలు సర్వసాధారణంగా మారాయి. దీంతో ఆయా దేశాలలో ప్రశాంతంగా బతకలేక పెట్టేబేడా సర్దుకుని సమీప దేశాలకు వలస వెళుతున్నారు. కాగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం కూడా వలసలు పెరగడానికి మరొక కారణం అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. అయితే పశ్చిమాసియా, దక్షిణాసియా, ఆఫ్రికా నుంచి ఇటీవలి కాలంలో యూరప్ దేశాలకు పెద్ద సంఖ్యలో వలసలు పెరిగాయి. అరబ్ విప్లవం తరువాత ట్యూనీసియా, లిబియా, ఈజిప్ట్, యెమెన్, అల్టీరియా నుంచి యూరప్ దేశాలకు వలసలు వెల్లువెత్తాయి. వలసల ప్రభావం అనేక రంగాలపై తీవ్రంగా పడుతోంది. ప్రధానంగా ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలపై వలసలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
సహజంగా అభివృద్ది చెందుతున్న దేశాల నుంచి అమెరికా, ఆస్ట్రేలియా లేదా బ్రిటన్ కు వెళ్లాలని చాలా మంది అనుకుంటారు. అయితే బ్రిటన్ నుంచి తాజాగా ఇతర ప్రాంతాలకు వలసలు ప్రారంభం కావడం అందరికీ విస్మయం కలిగిస్తోంది.