Hyderabad E Racing: తొలిసారిగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న.. ప్రపంచ ఈ- రేసింగ్ ఛాంపియన్‌షిప్‌నకు అట్టహాసంగా తెరలేచింది. ప్రపంచస్థాయి రేసర్లు ఈ పోటీల్లో అదరగొట్టారు. నగరవాసులకు సరికొత్త అనుభూతిని పరిచయం చేస్తూ.. ఈ ఈవెంట్ కొత్త కళను సంతరించుకుంది. సాగర తీరాన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ప్రధాన రేస్ ప్రారంభమైంది.
ప్రారంభమైన ఈ రేసింగ్ పోటీలు..(Hyderabad E Racing)
ఫార్ములా వన్ తర్వాత.. ఫార్ములా-ఈ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలకు అత్యంత ప్రజాదరణ ఏర్పడింది. దానికి తగిన విధంగానే.. హైదరాబాద్‌లో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ కార్ రేస్ ను చూసేందుకు.. నగరవాసులు తరలివచ్చారు. నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన రేసింగ్ సర్క్యూట్‌లో ఫార్ములా-ఈ రేసు కార్లు దూసుకుపోతున్నాయి. పలు దేశాల నుంచి వచ్చిన రేసర్లు.. వాయు వేగంతో కార్లతో దూసుకుపోతున్నారు. జాగ్వార్, నిస్సాన్, కప్రా, అవలాంచ్, మహింద్రా కార్లు ట్రాక్ పై దుమ్ము రేపాయి. మధ్యాహ్నం 3 తర్వాత ప్రధాన రేస్ ప్రారంభమైంది. మొత్తం 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్‌లో 11 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన 22 మంది రేసర్లు రేస్‌లో పాల్గొన్నారు.
ఈ రేసింగ్ కు హాజరైన ప్రముఖులు..
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుండటంతో.. ఈ రేస్ కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు సైతం హాజరయ్యారు. ప్రముఖ క్రికెటర్లు.. సచిన్ తెందూల్కర్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, యజువేంద్ర చాహల్ హాజరయ్యారు. ఇక బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ రేస్‌ను తిలకించారు. రాజకీయ ప్రముఖులు మంత్రి కేటీఆర్ , ఎంపీ సంతోష్, ఎంపీ రామ్మెహన్ నాయుడు, గల్లా జయదేవ్, నటుడు రాంచరణ్ కూడా హాజరయ్యారు. వేగంగా దూసుకెళ్తోన్న కార్లను చూసి ప్రేక్షకులు కేరింతలు కొట్టారు.
Master Blaster #SachinTendulkar at #HyderabadEPrix venue pic.twitter.com/EpqSOt1xML
— Sarita Avula (@SaritaAvula) February 11, 2023
21వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు..
ఫార్ములా-ఈ రేస్‌ను చూసేందుకు వచ్చే ప్రేక్షకుల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. దాదాపు 21 వేల మంది హాజరైనట్లు తెలుస్తోంది. రేస్ నేపథ్యంలో ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం, మింట్ కంపౌండ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాలను పూర్తిగా మూసేశారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.