Site icon Prime9

PM Narendra Modi : రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేసిన ప్రధాని మోదీ.. ఇది రాజరికం కాదని కేసీఆర్‌కు గట్టిగా చెప్పానంటూ

pm narendra modi nizamabad tour details and shocking comments on kcr family

pm narendra modi nizamabad tour details and shocking comments on kcr family

PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు నిజామాబాద్‌ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గత ఆదివారం నాడు మహబూబ్ నగర్ లో పర్యటించిన విషయం తెలిసిందే. రెండురోజుల వ్యవధిలో తెలంగాణలో ప్రధాని రెండోసారి పర్యటించడం గమనార్హం. ఈ వరుస పర్యటనల  నేపధ్యంలో ప్రధాని మోదీ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. కాగా ఈ పర్యటనలో భాగంగా ముందుగా ఇందూరులోని గిరిరాజ్‌ కళాశాల మైదనంలో ఏర్పాటు చేసిన జనగర్జన సభా వేదికపై నుంచే ప్రధాని మోదీ.. రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధాని మోదీ సభ కావడంతో ప్రజలు, కార్యకర్తలు సభా స్థలానికి భారీగా చేరుకున్నారు. దీంతో సభా ప్రాంగణం అంతా జనంతో నిండిపోయింది.

ముందుగా రామగుండంలో ఎన్టీపీసీ రూ.6 వేల కోట్లతో చేపట్టిన విద్యుత్తు ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మనోహరాబాద్‌ – సిద్దిపేట రైల్వేలైన్‌ను ప్రారంభించారు. అలానే ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ తొలి యూనిట్‌ను ప్రారంభించుకున్నట్లు చెప్పిన మోదీ.. త్వరలోనే రెండో యూనిట్‌ అందుబాటులోకి వస్తుందని హామీ ఇచ్చారు. ఎన్టీపీసీతో రాష్ట్ర ప్రజలకు రూ.4వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. తెలంగాణ ప్రజల కోసం బీబీనగర్‌లో ఎయిమ్స్‌ నిర్మిస్తున్నట్లు మోదీ (PM Narendra Modi) గుర్తు చేశారు.

 

 

అదే విధంగా మోదీ మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితమే మహిళా రిజర్వేషన్ల చట్టం తీసుకొచ్చినట్లు గుర్తు చేసిన ఆయన.. భరతమాత రూపంలో సభకు వచ్చిన మహిళలకు అభినందనలు తెలిపారు. ‘‘మహిళలు పెద్ద సంఖ్యలో రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. భవిష్యత్‌లో మరింత మహిళా శక్తిని మనం చూడనున్నాం. తెలంగాణ తల్లులు, చెల్లెమ్మలు ఓట్ల రూపంలో భాజపాను ఆశీర్వదించాలి. తెలంగాణ ప్రజల్లో ఎంతో శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు ఉన్నాయి. ప్రపంచానికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించిన ఘనత తెలంగాణదే అని మోదీ కొనియాడారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ తల్లులు, చెల్లెమ్మలు భాజపాను ఆశీర్వదించాలని ప్రధాని మోదీ కోరారు. తెలంగాణ అభివృద్ధి కోసం భాజపా కట్టుబడి ఉందని అన్నారు.

కేసీఆర్ ఫ్యామిలీపై ఫైర్..

ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ సాకారమైందని.. కానీ రాష్ట్ర ప్రజల సంపదను ఓ కుటుంబం దోచుకుంటోందని మోదీ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్య కుటుంబాన్ని భారాస కుటుంబ స్వామ్యంగా మార్చిందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన ప్రతిఫలాన్ని ఒక కుటుంబమే అనుభవిస్తోంది. కేసీఆర్‌, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు మాత్రమే ధనికులయ్యారని.. తెలంగాణ యువత కుటుంబ పాలనకు మరో అవకాశం ఇవ్వొద్దని కోరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఢిల్లీ వచ్చి కలిశారని.. ఎన్డీయేలో చేరతామని అడిగి.. కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారని తెలిపారు. కానీ ఇది రాజరికం కాదని కేసీఆర్‌కు గట్టిగా చెప్పినట్లు మోదీ వెల్లడించారు. ప్రజలు ఆశీర్వదించిన వారే పాలకులని, బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోబోమని మోదీ తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

 

Exit mobile version